కర్రెగుట్టలపై బేస్ క్యాంప్

కర్రెగుట్టలపై బేస్ క్యాంప్
  • ములుగు జిల్లా వాజేడు మండలం మురుమూరులో ఏర్పాటు

వెంకటాపురం, వెలుగు: తెలంగాణ–ఛత్తీస్​గఢ్​ సరిహద్దుల్లోని కర్రిగుట్టలను స్వాధీనం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం యాక్షన్  ప్లాన్  రెడీ చేస్తోంది. తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లోని కొన్ని గ్రామాలను ఎంపిక చేసి, సీఆర్పీఎఫ్  బేస్​ క్యాంప్​లను ఏర్పాటు చేస్తున్నారు.

 గతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సత్యనారాయణపురంలో సీఆర్పీఎఫ్  బెటాలియన్​ను ఏర్పాటు చేసి, అనంతరం పూసుగుప్ప, వద్దిపేట, చలమల, చిన్నాపురం వంటి మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో బేస్  క్యాంప్ లను ఏర్పాటు చేశారు. దీంతో గత మార్చి, ఏప్రిల్​ నెలల్లో జరిగిన కగార్  ఆపరేషన్  అనంతరం మావోయిస్టులు రాష్ట్రంలోకి రాలేకపోయారు. 

పామునూరు టు కర్రెగుట్టలు.. 

తెలంగాణ–ఛత్తీస్​గఢ్​ సరిహద్దులోని కర్రె గుట్టలు దట్టమైన అడవులు, పెద్ద బండలు, లోయలతో శత్రు దుర్భేద్యంగా ఉంటుంది. దీంతో కర్రె గుట్టలపై బేస్  క్యాంప్  ఏర్పాటు చేయాలని ప్రయత్నించినప్పటికీ అక్కడికి చేరుకోవడం కష్ట సాధ్యమైంది. ఈక్రమంలో వాజేడు మండలం మురుమూరు గ్రామం నుంచి పామునూరు గ్రామం (గుట్టల్లో ఉన్న గ్రామం) వరకు సుమారు 8 కిలోమీటర్లు రహదారి నిర్మించి బేస్  క్యాంప్  ఏర్పాటు చేస్తే కర్రె గుట్టలకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం కర్రెగుట్టలు కేంద్రంగా పర్యాటక రంగం, ఆర్మీ శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పాలని యోచిస్తోంది.

ప్రజలు స్వేచ్ఛగా తిరగాలనే ఉద్దేశంతోనే..

సామాన్య ప్రజలు అడవుల్లో స్వేచ్ఛగా తిరగాలనే ఉద్దేశంతోనే మురుమూరులో 39 బెటాలియన్  క్యాంప్  ఏర్పాటు చేశామని సీఆర్పీఎఫ్  ఐజీ త్రివిక్రమ్  తెలిపారు. మంగళవారం మురుమూరులో క్యాంప్  ఏర్పాటు చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఆపరేషన్  కగార్​లో భాగంగా క్యాంప్  ఏర్పాటు చేశామని, పామునూరు నుంచి ఛత్తీస్​గఢ్​లోని గ్రామాలకు రహదారులు నిర్మిస్తున్నట్లు తెలిపారు.

 ఆయన వెంట సీఆర్పీఎఫ్​ హైదరాబాద్​ రేంజ్​ డీఐజీ ఎస్ హెచ్​ అనిల్  మిన్జ్, సీఆర్పీఎఫ్​ కమాండెంట్​ ప్రశాంత్  శ్రీవాస్తవ, ఎస్పీ సుధీర్  రామనాథ్, డీఎఫ్ వో రాహుల్  కె జాదవ్, ఓఎస్ డీ శివం ఉపాధ్యాయ, వెంకటాపురం సీఐ ముత్యం రమేశ్, వెంకటాపురం ఎస్సై తిరుపతి ఉన్నారు.