విదేశాల్లో బ్లాక్‌ మనీ పెట్టుబడులపై ఎంక్వైరీ

విదేశాల్లో బ్లాక్‌ మనీ పెట్టుబడులపై ఎంక్వైరీ
  • ‘పండోర పేపర్ల’పై దర్యాప్తు!
  • తప్పని తేలితే చట్ట పరంగా చర్యలు తప్పవన్న కేంద్రం
  • పనామా పేపర్లు, పారడైజ్‌ పేపర్లతో రూ. 20,352 కోట్ల బ్లాక్ మనీని గుర్తించాం
  • 380 మందిపైనా  దర్యాప్తు చేస్తామని ప్రకటన

బిజినెస్‌‌‌‌డెస్క్‌‌, వెలుగు: పండోర పేపర్లలో పేర్లున్న ఇండివిడ్యువల్స్‌‌, కంపెనీలు, ట్రస్టులపై దర్యాప్తు జరుపుతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తప్పు చేశారని తెలిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని పేర్కొంది. గతంలో వెలువడిన పనామా పేపర్లు, పారడైజ్ పేపర్లను ఇన్వెస్టిగేట్ చేయడం ద్వారా సుమారు రూ.20,352 కోట్ల బ్లాక్ మనీని  గుర్తించగలిగామని తెలిపింది. ‘పండోర పేపర్స్‌‌ ఇష్యూని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. సంబంధిత ఇన్వెస్టిగేటివ్‌‌ సంస్థలు దర్యాప్తు చేస్తాయి. చట్టపరంగా చర్యలు తీసుకుంటాయి’ అని ఫైనాన్స్‌‌ మినిస్ట్రీ ఓ స్టేట్‌‌మెంట్‌‌లో పేర్కొంది. పండోర పేపర్స్‌‌పై దర్యాప్తు సాఫీగా సాగడానికి విదేశీ  న్యాయవ్యవస్థలతో కలిసి పనిచేస్తామని వివరించింది.  ఈ పేపర్లలో ఉన్న వ్యక్తులు లేదా సంస్థలకు సంబంధించిన ఇన్‌‌ఫర్మేషన్‌‌ను పొందడానికి విదేశీ న్యాయవ్యవస్థలతో కలిసి పనిచేస్తామని తెలిపింది. ‘గతంలో ఇలాంటి ఫైనాన్షియల్ లీక్స్‌‌ జరిగాయి. పనామా పేపర్లు, పారడైజ్ పేపర్లు, హెఎస్‌‌బీసీ వంటి సంఘటనల్లో ప్రభుత్వం బ్లాక్‌‌ మనీ, ట్యాక్స్‌‌ చట్టాల కింద దర్యాప్తు జరిపింది. లెక్కల్లో చూపని విదేశీ ఆస్తుల, ఆదాయాలపై తగిన ట్యాక్స్‌‌లను, పెనాల్టీలను విధించాం’ అని ఫైనాన్స్‌‌ మినిస్ట్రీ పేర్కొంది.

పండోర పేపర్స్ అంటే..

తాజాగా 14 గ్లోబల్‌‌‌‌ కార్పొరేట్ సర్వీసెస్ కంపెనీల నుంచి 1.19 కోట్ల ఫైల్స్‌‌ లీక్ అయ్యాయి. వీటిని పండోర పేపర్స్ అంటున్నారు. ట్యాక్స్‌‌లు తక్కువగా ఉండి, ప్రైవసీ పరంగా గోప్యతను పాటించే దేశాల్లో డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసి ట్యాక్స్ ఎగ్గొడుతున్న ఇండివిడ్యువల్స్‌‌ లేదా సంస్థలను గురించి పండోర పేపర్స్ బయటపెట్టాయి.  ఇంటర్నేషనల్‌‌ కన్సార్షియం ఆఫ్  ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులకు (ఐసీఐజే)  చెందిన 600 మంది జర్నలిస్టులు  ఈ ఫైల్స్‌‌ లీక్  చేయడంలో  కీలక పాత్ర పోషించారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన రాజకీయ నేతలు, సినిమా స్టార్లు, బిజినెస్‌‌ మ్యాన్‌‌ల గుట్టును ఈ  పండోర పేపర్స్ రట్టు చేశాయి. ఇండియాకు చెందిన 380 మంది పేర్లు ఈ పేపర్‌‌‌‌లో ఉన్నాయి. కొంత మంది లీగల్‌‌గానే ఆఫ్‌‌షోర్ కంపెనీలను లేదా సంస్థలను  ఏర్పాటు చేస్తున్నా, మరికొంత మంది ట్యాక్స్‌‌ను ఎగ్గొట్టాలనే ఉద్దేశంతోనే ఈ కంపెనీలను ఏర్పాటు చేశారు. ఆఫ్‌‌షోర్ కంపెనీల నుంచి తమ రియల్ ఐడెంటిటీని దాస్తున్నారు. క్రెడిటర్లు, ఇన్‌‌కమ్ ట్యాక్స్ అధికారుల నుంచి తమ సంపదను దాచిపెడుతున్నారు.

దివాలా తీశానన్న అనిల్ అంబానీకి విదేశాల్లో కంపెనీలు

‘నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. నాకు ఏ కంపెనీలోనూ ఆస్తుల్లేవు’.. కిందటేడాది బ్రిటన్‌‌‌‌ కోర్టులో అడాగ్‌‌ చైర్మన్ అనిల్ అంబానీ చెప్పిన మాటలివి.  మూడు  చైనీస్ బ్యాంకులకు  716 మిలియన్ డాలర్లను చెల్లించాలని బ్రిటన్ కోర్టు ఆదేశించగా, ఆయనీ వ్యాఖ్యలు చేశారు. తాజాగా ‘పండోర పేపర్స్‌‌’ ప్రకారం ఆయనకు18 ఆఫ్‌‌షోర్‌‌‌‌ (విదేశాల్లో) కంపెనీలు ఉన్నాయని తెలిసింది. జెర్సీ, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌‌ (బీవీఐ),  సైప్రస్‌‌ దేశాల్లో ఆయనీ కంపెనీలను 2007–2010 మధ్య పెట్టారని పండోర పేపర్స్‌‌ ద్వారా తెలుస్తోంది. ఇందులో కనీసం 7 కంపెనీలు వివిధ బ్యాంకుల నుంచి అప్పులు చేయగా, సుమారు 1.3 బిలియన్ డాలర్లను ఈ కంపెనీలు ఇన్వెస్ట్ చేయడం గమనించాలి.  దేశంలోని బ్యాంకుల నుంచి కోట్ల రూపాయిలు అప్పులు తీసుకొని, ఎగ్గొట్టి ఆ డబ్బులను విదేశాలకు తరలిస్తున్న పెద్ద పెద్ద వాళ్ల గుట్టును పండోర పేపర్స్‌‌ బయటపెట్టాయి. మరో ఆర్థిక నేరగాడు నీరవ్‌‌ మోడీ  పేరుకూడా వినిపిస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌‌కు వేల కోట్లు టోకరా పెట్టిన విషయం తెలిసిందే.  నీరవ్‌‌ మోడీ విదేశాలకు చెక్కేసే నెల ముందు ఆయన సిస్టర్‌‌‌‌ ఆఫ్‌‌షోర్‌‌‌‌ ట్రస్ట్‌‌ను ఏర్పాటు చేసింది. బయోకాన్‌‌ ఫౌండర్ కిరణ్‌‌ మంజుందార్‌‌‌‌ షా భర్త  జాన్‌‌ మెక్‌‌కల్లమ్‌‌ మార్షల్‌‌ పేరు కూడా  పండోర పేపర్స్‌‌లో ఉంది. ఇన్‌‌సైడర్‌‌‌‌ ట్రేడింగ్‌‌కు పాల్పడ్డాడని సెబీ  బ్యాన్ చేసిన ఓ వ్యక్తితో ఆయన విదేశాల్లో ట్రస్ట్ ఏర్పాటు చేశాడని తెలిసింది. వాషింగ్టన్ పోస్ట్‌‌, ఇండియన్ ఎక్స్‌‌ప్రెస్‌‌ ఈ పేపర్లను వెరిఫై చేస్తున్నాయి. గౌతమ్ అదానీ  బ్రదర్   బ్రిటిష్  వర్జిన్ ఐలాండ్స్‌‌లో మూడేళ్ల కిందట  ఓ కంపెనీని ఏర్పాటు చేశాడని ఈ మీడియా సంస్థ ప్రకటించింది.  కానీ, ఈ కంపెనీ మూతపడిందని  ఆయన చెబుతున్నారు. ముంబైకి చెందిన రియల్‌‌ ఎస్టేట్‌‌ సెక్టార్‌‌లోని వ్యాపారుల పేర్లను ఈ మీడియా సంస్థ ప్రకటించనుందని తెలిసింది. వీరంతా కలిసి బ్యాంకులకు రూ. 88 వేల కోట్లు బాకీ ఉన్నారు.ఈ వ్యాపారులు 2007 నుంచి  జైలులో ఉన్నారని పండోర పేపర్స్ ద్వారా తెలుస్తోంది. బీవీఐ, బహమాస్‌‌ లలో ఆఫ్‌‌షోర్‌‌‌‌ కంపెనీలను వీరు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మాజీ క్రికేటర్ సచిన్ టెండుల్కర్‌‌‌‌, బాలీవుడ్ యాక్టర్ జాకీ ష్రాఫ్‌‌ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.  గ్లోబల్‌‌గా చూస్తే రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్, చెక్ ప్రైమ్‌‌ మినిస్టర్‌‌‌‌ అండ్రేజ్‌‌ బాబీస్‌‌, పాకిస్తాన్ ప్రైమ్‌‌ మినిస్టర్‌‌‌‌ ఇమ్రాన్‌‌ ఖాన్‌‌కు దగ్గరి సన్నిహితుల పేర్లు  కూడా ఈ పండోర పేపర్లలో ఉన్నాయి.