323 కోట్లు ఎగ్గొట్టిన కేంద్రం!

323 కోట్లు ఎగ్గొట్టిన కేంద్రం!
  •     గత నవంబర్ నుంచి ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ఎం ఫండ్స్ నిలిపివేత
  •     నిధులు ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి స్టేట్ ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ఎం డైరెక్టర్ లేఖ

హైదరాబాద్, వెలుగు: నేషనల్ హెల్త్ మిషన్(ఎన్​హెచ్ఎం) కింద తెలంగాణకు రావాల్సిన రూ.323.73 కోట్లను కేంద్ర సర్కార్ ఇవ్వలేదు. గతేడాది నవంబర్ నుంచి నిధుల రిలీజ్ ఆపేసింది. దీంతో ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ఎం కింద ఉన్న ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణ ఆరోగ్యశాఖకు భారంగా మారింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ స్టేట్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్‌‌‌‌‌‌‌‌, స్టేట్ ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ఎం డైరెక్టర్ తాజాగా మరోసారి కేంద్రానికి లేఖ రాశారు . గత ఆర్థిక సంవత్సరంలో(2023–2024) ఎన్‌‌‌‌హెచ్ఎం కింద తెలంగాణకు 888.13 కోట్లు ఇచ్చేందుకు తొలుత కేంద్ర ఆరోగ్యశాఖ అంగీకారం తెలిపింది. 

ఈ బడ్జెట్ ప్రకారం ఆరోగ్యశాఖ కార్యక్రమాలను అమలులోకి తీసుకొచ్చింది. మొత్తం నాలుగు విడతల్లో ఈ నిధులను విడుదల చేయాల్సి ఉండగా, గతేడాది నవంబర్ నాటికి రెండు విడుతల నిధులను రిలీజ్ చేసింది. రెండు విడుతల్లో కలిపి రూ.564.4 కోట్లు విడుదల చేసింది. థర్డ్, ఫోర్త్ ఇన్‌‌‌‌స్టాల్‌‌‌‌మెంట్‌‌‌‌కు సంబంధించిన రూ.323.73 నిధుల విడుదలను ఆపేసింది. దీంతో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని ఇప్పటికే పలుమార్లు స్టేట్ ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ఎం డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ కేంద్రానికి లేఖ రాశారు. అయినా, ఇప్పటివరకూ నిధులను విడుదల చేయలేదు. 

దీంతో కాంట్రాక్టర్లకు నిధులు, ఉద్యోగులకు జీతాలు, క్షేత్రస్థాయిలో పనిచేసే ఆశా వర్కర్లకు ఇన్సెంటివ్ లు ఆగిపోయాయి. ఇప్పటికైనా నిధులు విడుదల చేయాలని కోరుతూ స్టేట్ ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ఎం డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ కర్ణన్‌‌‌‌ మరోసారి కేంద్రానికి లేఖ రాశారు. కేంద్ర ఆరోగ్యశాఖ నిబంధనల ప్రకారం అన్ని సక్రమంగానే చేశామని, అన్ని యుటిలిటీ సర్టిఫికెట్లను సమర్పించామని అయినా కూడా నిధులు ఆపేశారని లేఖలో పేర్కొన్నారు. అయితే, ఇప్పటికే కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో, గత ఆర్థిక సంవత్సరపు నిధులను విడుదల చేస్తారా? లేదా? అన్నదానిపై సందిగ్ధం నెలకొంది.