
- పంచాయతీ సెక్రటరీలకు ఉన్నతాధికారుల ఆదేశాలు
- 15వ ఫైనాన్స్ ఫండ్స్ నుంచే చెక్కులు జమ చేయాలని సూచన
- నెలాఖరులో నేరుగా కొత్త అకౌంట్లలోకి కేంద్రం నిధులు
హైదరాబాద్, వెలుగు : గ్రామ పంచాయతీల అకౌంట్లలో నిధులను వీలైనంత మేరకు వాడేయాలని, ఖాతాల్లో పెద్ద మొత్తంలో ఫండ్స్ లేకుండా చూడాలని పంచాయతీ సెక్రటరీలకు ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే చేపట్టిన పనులు, సిబ్బంది జీతాలు, కరెంట్ బిల్లులకు సెంట్రల్ ఫండ్స్ ను వాడుకునేలా చెక్కులు జమ చేయాలని సూచించారు. పది రోజుల్లో ఈ పక్రియను పూర్తి చేయాలని డెడ్ లైన్ విధించారు. దీంతో సెక్రటరీలు గ్రామాల్లో పెండింగ్ బిల్లులకు సంబంధించిన చెక్కులను ఎస్టీవోల్లో జమ చేస్తున్నారు. వచ్చే ఆరు నెలల కోసం కేంద్రం జీపీలకు ఫండ్స్ రిలీజ్ చేయాలంటే గతంలో ఇచ్చిన ఫండ్స్ కు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు (యూసీలు) సమర్పించాల్సి ఉండడంతో ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.
నెలాఖరులో కేంద్రం నుంచి నేరుగా నిధులు
గ్రామ పంచాయతీల ఖాతాల్లో ఈ నెలాఖరులో కేంద్రం నుంచి నేరుగా నిధులు జమ కానున్నాయి. ఇందుకోసం ఇప్పటికే అన్ని జీపీల సర్పంచులు, ఉపసర్పంచుల పేరిట జాయింట్ అకౌంట్లు ఓపెన్ చేశారు. రెండు, మూడు రోజుల క్రితం రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ కీ కోసం సర్పంచ్, ఉప సర్పంచ్ ల బయోమెట్రిక్ సైతం డీపీవోలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు అకౌంట్ల నిర్వహణ కొనసాగుతుండగా, ఇకపై పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టం(పీఎఫ్ఎంఎస్) ద్వారా జరగనుంది. ఇకపై 15వ ఫైనాన్స్ ఫండ్స్ నెలనెలా కాకుండా మూడు నెలలకోసారి జమ చేయనున్నారు. ఇలా ఏడాదిలో నాలుగు సార్లు 12 నెలల ఫండ్స్ జమ అవుతాయి. దీంతో అకౌంట్ల ఫ్రీజింగ్ సమస్య కూడా తలెత్తే అవకాశం లేదు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త విధానంతో గ్రామాల్లో చేసిన పనులకు వెంటనే బిల్లులు పొందే చాన్స్ ఉంటుంది.
ఫండ్స్ ఎక్కువ ఉన్న జీపీలకే ఆదేశాలిచ్చాం
జీపీలకు ఇచ్చిన ఆదేశాలపై రాష్ట్ర పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ రామారావును వివరణ కోరగా.. చాలా మేజర్ పంచాయతీల్లో 15వ ఫైనాన్స్ ఫండ్స్ ఎక్కువ మొత్తంలో వాడకుండా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అందుకే వీలైనంత మేరకు జీపీల అవసరాలకు వాటి నుంచే చెక్కులు ఇవ్వాలని చెప్పామని అన్నారు. పీఎఫ్ఎంఎస్ లోకి ఈ నెలాఖరు నుంచి వెళ్తున్నందు వల్లే పాత అకౌంట్లలో ఎక్కువ బ్యాలెన్స్ లేకుండా చూసుకోమని చెప్పామని, అకౌంట్ బ్యాలెన్స్ జీరో చేయాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చారు.
చెక్కులు జమ చేస్తే పైసలు వస్తయా?
ఇప్పటికే చేపట్టిన పనులకు చెక్కులు ఇష్యూ చేయడంలో ఇబ్బంది లేదని, కానీ అకౌంట్లలో ఎక్కువ నిధులు ఉన్నాయని చేయని పనులకు ప్రపోజల్ దశలోనే ఎలా చెక్కులు జమ చేయాలని సెక్రటరీలు, సర్పంచ్ లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసర్లు చెప్పినట్లు ఇప్పుడు చెక్కులు జమ చేసినా అకౌంట్లు ఫ్రీజింగ్ లో ఉండడం వల్ల డబ్బులు విడుదలయ్యే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. ఫ్రీజింగ్ ఎత్తేస్తే తప్ప చేతికి డబ్బులు వచ్చే పరిస్థితి లేదంటున్నారు.