పార్లమెంట్ సమావేశాలు త్వరగా ముగించే యోచ‌న‌లో కేంద్రం

పార్లమెంట్ సమావేశాలు త్వరగా ముగించే యోచ‌న‌లో కేంద్రం

క‌రోనా నేప‌థ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు త్వరగా ముగిసే అవకాశం క‌నిపిస్తోంది. దాదాపు 30 మంది వరకూ ఎంపీలు, కేంద్ర మంత్రులకు కరోనా వైరస్ సోకడంతో..సమావేశాల్ని వారం రోజుల ముందే ముగించడానికి కేంద్రం యోచిస్తోంది. ఎజెండాలో ఉన్న అన్ని బిల్లులు పాస్ అయ్యాక కుదింపు ఉండే అవకాశం ఉండ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

ఇప్పటికే చాలా మంది సభకు గైర్హాజ‌రవుతున్నారు. 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు స‌భ‌కు రావ‌ట్లేదు. స‌భ మొదలైన మొదటి వారంలోనే ఇద్దరు ఎంపీలు కరోనతో మృతి చెంద‌డంతో పలువురు ఎంపీలు మావేశాలకు రావాలంటే భయపడుతున్నారు. 70 శాతం మంది మాత్ర‌మే స‌భ‌కు హాజ‌ర‌వుతున్నారు. వచ్చే వారం సభ ముగిసేలా ఉందని ఇద్దరు పార్లమెంటు సీనియర్ అధికారులు తెలిపారు.

సెప్టెంబర్ 14న ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 18 రోజుల పాటు కొనసాగి..అక్టోబర్ 1 న ముగియాల్సి ఉంది. అయితే రోజురోజుకూ వైరస్ బారిన పడుతున్న సభ్యుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. దేశంలో కూడా కేసుల సంఖ్య 5.3 మిలియన్లకు పెరిగిన నేపథ్యంలో ప్ర‌భుత్వం స‌మావేశాల్ని త్వ‌ర‌గా ముగించే యోచ‌న‌లో ఉంది.