మణిపూర్​లో..శాంతిభద్రతలను పునరుద్ధరిస్తం

మణిపూర్​లో..శాంతిభద్రతలను పునరుద్ధరిస్తం

న్యూఢిల్లీ : గత రెండు నెలలుగా హింసతో అట్టుడుకుతున్న మణిపూర్ లో శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు ప్రధాని మోదీ సూచనలతో ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్  షా తెలిపారు. ఆ రాష్ట్రంలో హింస తలెత్తినప్పటి నుంచి ప్రధానితో తాను మాట్లాడని రోజులేదని ఆయన పేర్కొన్నారు. మణిపూర్​లో హింసాత్మక ఆందోళనలపై అమిత్  షా శనివారం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. బీజేపీ నుంచి ఆ పార్టీ ప్రెసిడెంట్  జేపీ నడ్డా, కాంగ్రెస్  నుంచి మణిపూర్  మాజీ సీఎం ఓక్రం ఇబోబీ సింగ్, టీఎంసీ నుంచి డెరెక్  ఒబ్రెయిన్, ఎన్ పీపీ నుంచి మేఘాలయ సీఎం కాన్రాడ్  సింగ్, అన్నాడీఎంకే నుంచి ఎం.తంబిదురై, డీఎంకే నుంచి తిరుచి శివ, బీజేడీ నుంచి పినాకి మిశ్రా, ఆప్  నుంచి సంజయ్  సింగ్, ఆర్జేడీ నుంచి మనోజ్  ఝా, శివసేన నుంచి ప్రియాంకా చతుర్వేది, సమాజ్ వాదీ పార్టీ నుంచి రాంగోపాల్  వర్మ హాజరయ్యారు.

అలాగే కేంద్ర మంత్రులు ప్రహ్లాద్  జోషి, నిత్యానంద్  రాయ్, అజయ్  కుమార్  మిశ్రా, యూనియన్  హోం సెక్రటరీ అజయ్  భల్లా, డైరెక్టర్  ఆఫ్​ ఇంటెలిజెన్స్ బ్యూరో తపన్  దేకా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం అయిపోయిన తర్వాత బీజేపీ మణిపూర్  ఇన్ చార్జి సంబిత్  పాత్ర మీడియాతో మాట్లాడారు. మణిపూర్​లో శాంతిభద్రతలు పునరుద్ధరించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటున్నదని ఆయన చెప్పారు. ఈ నెల 13 నుంచి ఎవరూ కూడా అల్లర్లలో ప్రాణాలు కోల్పోలేదని, అది ఊరట కలిగించే విషయమని పేర్కొన్నారు. మీటింగ్ కు హాజరైన అపొజిషన్  లీడర్లు మణిపూర్ లో పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. అల్లర్లు జరిగిన తర్వాత అమిత్  షా మణిపూర్ లో పర్యటించడాన్ని ప్రతిపక్షాల లీడర్లు అంగీకరించారని ఆయన వెల్లడించారు.

హింసను కట్టడి చేయడంలో విఫలం: ప్రతిపక్షాలు

మణిపూర్​లో హింసను కట్టడి చేయడంలో కేంద్రం ఫెయిలైందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ  విషయంలో కేంద్రం ఉదాసీన వైఖరితో వ్యవహరిస్తోందని ఫైరయ్యాయి. అల్లర్లకు మణిపూర్  సీఎంబీరేన్  సింగ్​ను బాధ్యుడిగా చేసి ఆయనను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్  చేశాయి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరాయి. మణిపూర్  తగలబడుతున్నా ప్రధాని మోదీ ఎందుకు మాట్లాడడం లేదని కాంగ్రెస్  పార్టీ నిలదీసింది.

మంత్రి గోడౌన్​కు నిప్పు

మణిపూర్​లో అల్లరి మూకల హింస కొనసాగుతూనే ఉంది. కొద్ది రోజులుగా మంత్రులు, నాయకుల ఇండ్లు, ఆస్తులను తగలబెడుతున్న ఆందోళనకారులు శనివారం ఇంఫాల్  జిల్లాలోని చింగారెల్ లో మంత్రి ఎల్. సుశీంద్రో కు చెందిన ప్రైవేట్  గోడౌన్​కు నిప్పంటించారు. శుక్రవారం రాత్రి ఇదే జిల్లాలోని ఖురాయ్ లో కూడా వినియోగదారులు, ఆహార శాఖల మంత్రికి చెందిన ఆస్తికి నిప్పు పెట్టడానికి యత్నించారు.

పోలీసులు, భద్రతా బలగాలు అడ్డుకోవడంతో దుండగుల ప్రయత్నం సఫలం కాలేదు. భద్రతా బలగాలు అర్ధరాత్రి వరకూ టియర్  గ్యాస్  ప్రయోగించి అల్లరి మూకలను చెదరగొట్టారు. ఈ నెల 14న వెస్ట్  ఇంఫాల్  జిల్లా లాంఫెల్  ప్రాంతంలో రాష్ట్ర శాఖ మంత్రి నెమ్చా కిప్ గెన్  నివాసానికి, కేంద్ర మంత్రి ఆర్ కే రంజన్  సింగ్​ ఇళ్లకు దుండగులు నిప్పు పెట్టారు. కుకీ, మైతీ తెగల మధ్య గత నెల 3న ప్రారంభమైన ఘర్షణల్లో ఇప్పటి వరకూ 120 మంది ప్రాణాలు కోల్పోయారు. మూడువేల మంది నిర్వాసితులుగా మిగిలారు.