
- ఉపాధి హామీ కోసం అదనంగా రూ. 40 వేల కోట్లు
- భవన నిర్మాణ కార్మికులకు రూ. 3955 కోట్లు
- ప్రకటించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ : కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తో ఇబ్బందులు ఎదుర్కొంటోన్న రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఆయా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ గాడిలో పడేంత వరకు రుణాలు పొందేందుకు ఎఫ్ఆర్బీఎం పరిమితిని పెంచతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రస్తుతం 3 శాతంగా ఉన్న పరిమితిని 5 శాతానికి పెంచింది. దీంతో రాష్ట్రాలు పలు ఫైనాన్షియల్ ఇన్ స్టిట్యూట్స్ నుంచి రుణాలు పొందవచ్చు. ఆదాయం లేకపోవటంతో పీఎంతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశాల్లో పలు రాష్ట్రాల సీఎం లు ఈ పరిమితిని పెంచాలని కోరారు. దీంతో కేంద్రం రుణాల పరిమితిని పెంచింది. రాష్ట్రాల ఓడీని సైతం 14 రోజుల నుంచి 21 రోజులకు పెంచింది. అదే ప్రధాని మోడీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ కి సంబంధించి ఐదో రోజు వివరాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాకు వివరించారు. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులకు నేరుగా వారి ఖాతాల్లోనే నగదు జమ చేశామన్నారు. ఇందుకోసం ఇప్పటికే రూ. 3955 కోట్లు ఖర్చు చేశామన్నారు. అదే విధంగా సొంతూళ్లకు వెళ్లిన వలస కార్మికులకు ఉపాధికి ఇబ్బంది కలగకుండా గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అదనంగా రూ. 40 వేల కోట్లు కేటాయించారు. ఇది కొన్ని లక్షల మంది వలస కార్మికులకు కరోనా ఎఫెక్ట్ పోయేంత వరకు సొంతూళ్లలో ఉపాధి పొందేందుకు ఉపయోగపడనుంది. అదే విధంగా వలస కార్మికులను తరలించేందుకు ఏర్పాటు చేసిన శ్రామిక్ రైళ్లలో 85 శాతం ఖర్చు కేంద్రమే భరిస్తుందని చెప్పారు. లాక్ డౌన్ కారణంగా ఉద్యోగులు ఇబ్బందులు పడకుండా ఈపీఎఫ్ తీసుకునేందుకు చేపట్టిన చర్యల కారణంగా దాదాపు 12 లక్షల మంది ఉద్యోగులు రూ. 3,600 కోట్ల పీఎఫ్ ను విత్ డ్రా చేసుకున్నారని చెప్పారు. పేదల ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉజ్వల పథకం కింద మూడు నెలల పాటు సిలిండర్లు అందజేస్తున్నామన్నారు. ల్యాండ్, లేబర్, లా చట్టాలను సంస్కరించనున్నట్లు ప్రకటించారు. కరోనా నివారణకు రాష్ట్రాలకు రూ. 4113 కోట్లు ఇచ్చినట్లు…ఇతర ఖర్చుల కోసం రూ. 3750 కోట్లు ఇచ్చామన్నారు. పీపీఈ కిట్లను మనమే తయారు చేసుంటున్నామని నిర్మలా సీతారామన్ చెప్పారు.