సెంట్రల్ జాబ్స్​కు ఒక్కటే ఎగ్జామ్

సెంట్రల్ జాబ్స్​కు  ఒక్కటే ఎగ్జామ్

కేంద్ర ప్రభుత్వంలోని గ్రూప్–బి, గ్రూప్–సి ఉద్యోగాల భర్తీ విధానం పూర్తిగా మారిపోబోతోంది. ‘నేషనల్​ రిక్రూట్​మెంట్​ అథారిటీ’ని ఏర్పాటు చేసి, దాని ద్వారానే పరీక్ష నిర్వహించి, రిక్రూట్​మెంట్లు చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. దాదాపు అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోని ఉద్యోగాలను దీనిద్వారానే భర్తీ చేస్తారు. దీంతో వేర్వేరు నోటిఫికేషన్లు వేయడం, ప్రతిసారీ అప్లికేషన్​ చేసుకోవాల్సి రావడం తప్పనుంది.

ఎన్ఆర్ఏ ఏం చేస్తుంది?

రదు్ద్రపక ప్రభుత్వంలోని గ్రూప్–బీ(నాన్ గెజిటెడ్), గ్రూప్–సీ జాబ్స్ కు రిక్రూట్ మెంట్ పద్ధతంతా మారిపోబోతోంది. నేషనల్ రిక్రూట్ మెంట్ అథారిటీ(ఎన్ఆర్ఏ) అనే కొత్త సంస్థ వీటికి ఒకే పరీక్షను నిర్వహించనుంది. ఆ తర్వాత 100 రోజుల్లోగా జాయినింగ్ లెటర్ చేతిలో పెట్టబోతోంది. ప్రస్తుతం గ్రూప్ బీ, గ్రూప్ సీ కేటగిరీల్లో 1.5 లక్షల ఉద్యోగాలున్నట్లు డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీవోపీటీ) పెద్దాఫీసర్లు వెల్లడించారు. ప్రస్తుతం కేంద్రంలోని డిపార్ట్ మెంట్లకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్ సీ), రైల్వే తదితర బోర్డులు వేటికవే ప్రత్యేక ఎగ్జామ్స్ ను నిర్వహించుకుని ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఒక్క నోటిఫికేషన్ రిక్రూట్ మెంట్ జరగాలంటే కనీసం 18 నుంచి 20 నెలల సమయం పడుతోంది. పొరపాటున కోర్టు కేసుల్లో చిక్కుకుంటే, ఎప్పటికి బయటపడుతుందో తెలీని స్థితి.

కేంద్రంలోని గ్రూప్ బీ(నాన్ గెజిటెడ్), గ్రూప్ సీ జాబ్స్ రిక్రూట్ మెంట్ ను మూడు నెలల్లోగా పూర్తి చేయడం ఎన్ఆర్ఏ పని అని పేరు చెప్పడానికి ఇష్టపడని డీవోపీటీ పెద్దాఫీసర్ తెలిపారు. కొత్త సర్కారు ఏర్పాటైన ఓ ఏడాదిలోగా ఎన్ఆర్ఏ అమల్లోకి వస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఎన్ఆర్ఏ రాకతో రిక్రూట్ మెంట్లలో పెద్ద మార్పు వస్తుందని పేర్కొన్నారు. ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖాళీ లేకుండా ఎప్పటికప్పుడు రిక్రూట్ మెంట్ జరిపే అవకాశం ఉంటుందని వెల్లడించారు.

ఎగ్జామ్ ఒకటే.. కటాఫే వేరు..

గ్రూప్ బీ, గ్రూప్ సీ జాబ్స్ కు టెన్త్ నుంచి డిగ్రీ వరకూ విద్యార్హత సరిపోతుంది. వీటన్నింటికి వేర్వేరు ఎగ్జామ్స్ పెట్టేకంటే, ఒకటే ఎగ్జామ్ పెట్టాలనే ఆలోచన నుంచే ఎన్ఆర్ఏ పురుడుపోసుకుంది. దీని వల్ల విలువైన సమయం, డబ్బు కలిసొస్తాయని డీవోపీటీ భావించింది. ఫలితాలు వెల్లడించిన తర్వాత డిపార్ట్ మెంట్లే సొంతంగా కటాఫ్ నిర్ణయించుకుని, విడతల వారీగా అభ్యర్థులను రిక్రూట్ చేసుకుంటాయి.

ఒక్క ఎగ్జామ్.. మూడేళ్ల వ్యాలిడిటీ..

జీమ్యాట్, క్యాట్ ఎగ్జామ్స్ తరహాలో ఎన్ఆర్ఏ గ్రూప్ బీ, గ్రూప్ సీ జాబ్స్ ఎగ్జామ్స్ ను ఎన్ఆర్ఏ నిర్వహిస్తుందని డీవోపీటీ పెద్దాఫీసర్లు చెబుతున్నారు. ఒక్కసారి ఎగ్జామ్ రాస్తే వచ్చే స్కోర్ మూడేళ్ల పాటు చెల్లుతుందని, ఏటా ఆ స్కోర్ ను ఇంప్రూవ్ చేసుకునేందుకు పరీక్ష రాయొచ్చని వెల్లడించారు.