- కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత అంపశయ్య నవీన్
హనుమకొండ, వెలుగు : కాళోజీ నారాయణరావు ప్రజల పక్షాన నిలబడేవారని కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత అంపశయ్య నవీన్ అన్నారు. కాళోజీ రామేశ్వరరావు ట్రెడిషనల్‌గా మాట్లాడితే.. నారాయణరావు మాటలు రెవల్యూషనరీగా ఉండేవని చెప్పారు. హనుమకొండ కిషన్‌పురలోని వాగ్దేవి కాలేజీ సెమినార్ హాల్‌లో కాళోజీ ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు ఎస్.జీవన్ కుమార్ అధ్యక్షతన గురువారం ‘కాళోజీ సోదరుల యాది సభ’ నిర్వహించారు. హాజరైన కాళోజీ ఫౌండేషన్ సభ్యులు, కవులు, రచయితలు, విద్యావంతులు ముందుగా అందెశ్రీ మృతికి సంతాపంగా శ్రద్ధాంజలి ఘటించారు.
తర్వాత రిటైర్డ్ జడ్జి, కవి, కథా రచయిత, సాహితీవేత్త మంగారి రాజేందర్ జింజో దంపతులు, ఉర్దూ కవి అంజనీకుమార్ గోయల్‌కు కాళోజీ సోదరుల స్మారక పురస్కారం- అందజేశారు. అనంతరం అంపశయ్య నవీన్ మాట్లాడుతూ కాళోజీ నారాయణరావు ఏ భావానికి లొంగకుండా.. తన వ్యక్తిగత భావాలకే ప్రాధాన్యం ఇచ్చేవారన్నారు. ‘నా గొడవ’ పేరిట సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా స్పందించి, ప్రజాకవిగా కీర్తి గడించిన కాళోజీ స్ఫూర్తిని నేటి తరం అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.
కాళోజీ తెలుగులోనే కాకుండా ఉర్దు, హిందీ, కన్నడం, ఇంగ్లీష్ తదితర భాషల్లోనూ రచనలు చేశారని ప్రముఖ వక్త శేషభట్టర్ నరసింహచార్యులు (జీవన్) గుర్తు చేశారు. తర్వాత కాళోజీ ఫౌండేషన్ ఆశయాలు, లక్ష్యాలను జాయింట్ సెక్రటరీ పొట్లపల్లి శ్రీనివాసరావు వివరించారు. కార్యక్రమంలో కాళోజీ ఫౌండేషన్ ట్రెజరర్ పందిళ్ల అశోక్‌కుమార్, కార్యదర్శి వీఆర్. విద్యార్థి, సభ్యులు డాక్టర్ ఆగపాటి రాజ్‌కుమార్, పి.చంద్, మర్రి మాధవిరెడ్డి, డాక్టర్ కర్రె సదాశివ్ పాల్గొన్నారు.
