కేసీఆర్.. ఇవేం డ్రామాలు?

కేసీఆర్.. ఇవేం డ్రామాలు?
  • నీవల్లే ట్రిబ్యునల్​ ఆలస్యం: కేంద్ర మంత్రి షెకావత్
  • గెజిట్ నోటిఫికేషన్ కు అప్పుడు సరేనన్నవు
  • ఇప్పుడేమో కేంద్రంపై నిందలేస్తున్నవు
  • సీఎం కుర్చీల కూసొని ఇట్లేనా మాట్లాడేది?
  • 8 నెలలు సుప్రీంలో కేసు విత్ డ్రా చేసుకోలేదు
  • నువ్వు లేట్​ చేసి కేంద్రంపై నెపమా?
  • ఇకనైనా ప్రాజెక్టులు, నియంత్రణ బోర్డులకు ఇవ్వాలని సూచన

న్యూఢిల్లీ, వెలుగు: కొత్త ట్రిబ్యునల్​, కృష్ణా, గోదావరి బోర్డుల పరిధులకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విషయంలో సీఎం కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మండిపడ్డారు. కేసీఆర్ కామెంట్లను తీవ్రంగా ఖండించారు. ఆయన తీరు ప్రజాస్వామ్యంపైనే దాడి అన్నారు. ‘‘గెజిట్ నోటిఫికేషన్ కు అప్పట్లో అపెక్స్ కౌన్సిల్ లో కేసీఆర్ సరేనన్నారు. ఇప్పుడేమో సడెన్​గా ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు. బాధ్యతాయుతమైన సీఎం కుర్చీలో కూర్చొని ఇలా మాట్లాడటం సరికాదు” అంటూ దుయ్యబట్టారు. కేసీఆర్ ఎందుకిలాంటి కామెంట్లు చేస్తున్నదీ తెలంగాణ ప్రజలకు బాగా తెలుసన్నారు. గురువారం ఢిల్లీలోని కేంద్ర జలశక్తి కార్యాలయంలో షెకావత్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ, ఏపీ ప్రజలకు, దేశ ప్రజలకు నిజం చెప్పేందుకే కేసీఆర్ కామెంట్లపై తాను వివరణ ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ‘‘వన్ సైడెడ్ స్టోరీలు ప్రజల్లోకి వెళ్లవద్దు. నాణానికి రెండు వైపులూ వాళ్లకు తెలియాలి” అన్నారు. ‘‘ఏపీ విభజన చట్టం ప్రకారమే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ), గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు(జీఆర్ఎంబీ)లను  పార్లమెంటు ఆమోదించింది. అది ల్యాండ్ ఆఫ్ ద లా. అంతేకాదు, గతేడాది అక్టోబర్ 6 న అపెక్స్ కౌన్సిల్ భేటీలో కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ పరిధుల నిర్ణయానికి తెలంగాణ, ఏపీ సీఎంలిద్దరూ అంగీకరించారు. గెజిట్ నోటిఫికేషన్ పై రెండు రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి, వాళ్ల అంగీకారం తర్వాతే నిర్ణయం తీసుకున్నాం. అలాంటప్పుడు ఇందులో కేంద్ర ప్రభుత్వ డ్రామా ఏముంది? ఈ విషయంలో కేంద్రం చేసింది డ్రామా ఎలా అవుతుంది?’’ అని ప్రశ్నించారు. నియంత్రణ బోర్డులకు అప్పగిస్తే వివాదాల్లేకుండా నీటి పంపిణీ జరుగుతుందని మంత్రి గుర్తు చేశారు. ఇరు రాష్ట్రాలు నోటిఫికేషన్ ప్రకారం ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించాలని సూచించారు. 
నియంత్రణను కూడా బోర్డుల చేతిలో పెట్టాలని షెకావత్​ స్పష్టం చేశారు. ‘‘బోర్డుల అనుమతులు లేని ప్రాజెక్టులకు సీడబ్ల్యూసీ ద్వారా డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్)లు సమర్పించండి. బోర్డుల నిర్వహణకు సిబ్బందిని, మౌలిక వసతులను ఏర్పాటు చేయండి” అని ఇరు రాష్ట్రాల సీఎంలకు హితవు పలికారు.
కేసీఆర్ వల్లే ఏడేళ్లు ఆగింది
తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ తీరు వల్లే కొత్త 
ట్రిబ్యునల్ ఏర్పాటు ఆలస్యమైందని షెకావత్ స్పష్టం చేశారు. ‘‘అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం కింద ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలంటూ 2015లో కేసీఆరే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇలా మ్యాటర్ కోర్టులో ఉన్నప్పుడు కేంద్రం ఎలాంటి నిర్ణయమూ తీసుకోడానికి వీలుండదు. కానీ కేసీఆర్ గతేడాది అక్టోబర్ 6 న జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో కొత్త ట్రిబ్యునల్ ప్రస్తావన తెచ్చారు. మ్యాటర్ కోర్టులో ఉందని గుర్తు చేస్తే, రెండు రోజుల్లో ఆ కేసును వెనక్కు తీసుకుంటామని చెప్పారు. వెనక్కు తీసుకోకుండా 8 నెలలు గడిపారు. మీటింగ్ తర్వాత సరిగ్గా ఏడాదికి, అంటే 2021 అక్టోబర్ 6న పిటిషన్ విత్ డ్రాకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఆ తర్వాత నెలకే కేసీఆర్ ఇప్పుడిలా ప్రెస్ మీట్ పెట్టి, తన వల్ల జరిగిన జాప్యానికి కేంద్రంపై నింద మోపడం ఏమిటి?’’ అంటూ దుయ్యబట్టారు. సుప్రీంకోర్టులో కేసు వేసి 2015 నుంచి ఇప్పటిదాకా ట్రిబ్యునల్ ఏర్పాటును ఆలస్యం చేసింది తెలంగాణ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ‘‘రెండు రాష్ట్రాల మధ్య నీటి సమస్య, విద్యుత్ ప్రాజెక్టుల వివాదాలు తదితర సమస్యలను పరిష్కారించాలని ప్రధాని నరేంద్ర మోడీ నాకు సూచించారు. ఆయన సలహా మేరకే అపెక్స్ కౌన్సిల్ చైర్మన్ హోదాలో రెండు రాష్ట్రాల సీఎంలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నా. సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నా” అని వివరించారు.
ట్రిబ్యునల్ పై న్యాయ సలహా
ట్రిబ్యునల్ కేసు వ్యవహారం సుప్రీంకోర్టులో ముగిసిన రోజే దాని ఏర్పాటు ప్రక్రియను కేంద్రం మొదలు పెట్టిందని మంత్రి చెప్పారు. అది కేంద్ర ప్రభుత్వ బాధ్యతేనన్నారు. ‘‘ఈ విషయంలో సలహా కోసం కేంద్ర న్యాయ శాఖకు ఫైలు పంపాం. ఆ మంత్రితో నేనే స్వయంగా మాట్లాడా. సాధ్యమైనంత తొందర్లో న్యాయ శాఖ సూచనలు వస్తాయని భావిస్తున్నాం. వాటి ఆధారంగా, కొత్త ట్రిబ్యునల్ తేవాలా, ఉన్నదే సరిపోతుందా అనేది స్పష్ట మవుతుంది.   బోర్డుల కోసం కేంద్రం ఇప్పటికే  తేదీ ఇచ్చింది. ఆలోగా బోర్డుల నిర్వహణకు తగిన వసతులను రాష్ట్రాలు కల్పించాలి. బోర్డుల నిర్వహణకు పరస్పర అంగీకారంతో వాయిదా వేయడానికి అభ్యంతరం లేదు. రెండు రాష్ట్రాలు పరస్పరం మాట్లాడుకుని, ఎలా అమలు చేయాలో ఆలోచించుకోవాలి. విద్యుత్ ప్రాజెక్టుల నిర్వహణలో గందరగోళమేమీ లేదు. నోటిఫికేషన్ లో పూర్తి స్పష్టత ఉంది” అని అన్నారు.