సీఎం కేసీఆర్​పై కేంద్రం మంత్రి కిషన్​రెడ్డి ఫైర్​

సీఎం కేసీఆర్​పై కేంద్రం మంత్రి కిషన్​రెడ్డి ఫైర్​
  • నీతి ఆయోగ్​పై కేసీఆర్​ వ్యాఖ్యలను ఖండిస్తున్నం
  • ఆయన మీటింగ్​కు రాకపోయినా ఫర్వాలేదు.. 
  • కానీ, దేశ ప్రతిష్ట దిగజార్చొద్దు
  • కుటుంబ, అవినీతి పాలనను బరాబర్​ ప్రశ్నిస్తామని హెచ్చరిక

న్యూఢిల్లీ, వెలుగు: ఫెడరలిజం అంటే కుటుంబ పాలన కాదనే విషయం సీఎం కేసీఆర్​ గుర్తుంచుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.  ఆదివారం ఢిల్లీలోని తన నివాసంలో కిషన్​రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రజలకు నేరుగా ఏది చేసినా... కేసీఆర్ ప్రశ్నిస్తున్నరు. ఆయన కుటుంబానికి ఇవ్వాలి అన్నట్లుగా వ్యవహరిస్తున్నరు. అవినీతికి, అధర్మానికి, అహంకారానికి, అధికార దుర్వినియోగానికి ప్రతిరూపంగా బీజేపీ పని చేయదు. ఈ విషయంలో కేసీఆర్... ఆయనకు ఆయనే సాటి” అని విమర్శించారు. నీతి ఆయోగ్ పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. ‘‘మీరు నీతులు, పాఠాలు నేర్పుతరా? ఫెడరలిజం, నీతి, నిజాయితీ గురించి మీరు మాట్లాడుతున్నరా?’’ అని కేసీఆర్​ను విమర్శించారు. మోడీని కలవడం ఇష్టంలేకపోతే ఫాంహౌస్​, ప్రగతి భవన్​లో ఉండాలన్నారు. ‘‘మీటింగ్​లకు రాకపోయినా ఫర్వాలేదు. కానీ, దేశ ప్రతిష్టను దిగజార్చవద్దు” అని సూచించారు. కుటుంబ, అవినీతి పాలనను బరాబర్ ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్​ను విమర్శిస్తే... తెలంగాణ ప్రజలను విమర్శించినట్లు కాదన్నారు. ‘‘సెక్రటేరియట్ లేని, ఐదేండ్లు మహిళా మంత్రి లేని, ఫాం హౌస్​ పాలన మోడీకి అలవాటు లేదు” అని పేర్కొన్నారు. నీతి ఆయోగ్​ మీటింగ్​కు కేసీఆర్ రాకపోవడం రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మంచిందికాదని చెప్పారు.  ‘‘కడుపు నొప్పి ఉంటే, తల నొప్పి అని... తల నరుక్కున్నట్లు కేసీఆర్ వ్యవహార శైలి ఉంది. తమ కుటుంబమే లేకపోతే... తెలంగాణ ఉద్యమమే లేదన్నట్లు కేసీఆర్ మాట్లాడుతున్నరు. కేసీఆర్​వి తొండి మాటలు, తొండి వ్యవహారాలు” అని మండిపడ్డారు.  

పెట్రోల్​, డీజిల్​పై వ్యాట్​ ఎందుకు తగ్గించలే?

కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు కూడా పెట్రోల్, డీజిల్​పై వ్యాట్​ను తగ్గిస్తే..  తెలంగాణ లో మాత్రం పెట్రోల్ పై 35 శాతం, డీజిల్ పై 27 శాతం ట్యాక్ లు వసూలు చేస్తున్నారని కిషన్​రెడ్డి మండిపడ్డారు. అలాంటప్పుడు అధిక ధరల గురించి కేసీఆర్ ఎలా మాట్లాడుతారని నిలదీశారు. వరంగల్, కరీంనగర్  స్మార్ట్ సిటీలకు కేంద్ర ఇచ్చిన నిధుల్ని కేసీఆర్ దారి మళ్లించారని, కేంద్రం ఒత్తిడితో మళ్లీ వాటిని ఖర్చు చేశారని పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించిన సైన్స్ సిటీకి కనీసం 25 ఎకరాల స్థలం ఇవ్వాలని కోరితే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిప్లే లేదన్నారు. 

రాష్ట్రంలో అధికారం పోతుందన్న భయంతో విష ప్రచారం

‘‘తెలంగాణలో బీజేపీ బలపడనంత వరకు కేంద్రం, నీతి ఆయోగ్​లు టీఆర్ఎస్​కు మంచిగా కనిపించాయి. కేంద్రం ర్యాంకులు ప్రకటిస్తే... కొడుకు, కూతురు సోషల్ మీడియాలో జబ్బలు చరుచుకుంటూ పోస్టులు పెట్టారు. రాష్ట్రంలో అధికారం పోతున్నదని, కొడుకు సీఎం కాడనే భయంతో కేసీఆర్ కేంద్రంపై విష ప్రచారం చేస్తున్నరు” అని కిషన్​రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అడిగితే మెడికల్ కాలేజీలను కేంద్రం ఇస్తుందన్నారు. ప్రతిపాదనలు పంపాలని రెండు సార్లు కేంద్ర మంత్రి లేఖలు రాస్తే.. స్థలం, రాష్ట్ర వాటా పెట్టాల్సి వస్తుందని టీఆర్ఎస్ సర్కార్ స్పందించలేదని తెలిపారు. అందుకే కేంద్రం ఒక్క రూపాయి అవసరం లేకుండా ఎయిమ్స్, ఈఎస్ఐ మెడికల్ కాలేజీలు పెట్టిందని వివరించారు. ‘‘దళితులకు ఇస్తామన్న మూడెకరాల భూమి ఏమైంది? దళిత సీఎం హామీ ఏమైంది? రూ. 3016 నిరుద్యోగ భృతి ఏమైంది?” అని మండిపడ్డారు.