దోపిడీదారులకు కేంద్రం సహకారం : మంత్రి పొన్నం

దోపిడీదారులకు కేంద్రం సహకారం : మంత్రి పొన్నం

ఎల్కతుర్తి, వెలుగు : దోపిడీదారుల నుంచి బీజేపీ వేల కోట్లు తీసుకొని వారికి సహకరిస్తోందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌ ఆరోపించారు. బ్లాక్‌‌‌‌మనీపై చర్యలు తీసుకోవాల్సిన ప్రధాని మోదీ దానిని సమర్థించుకోవడం సరికాదన్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికలపేటలో బుధవారం మీడియాతో మాట్లాడారు. రాజకీయ పార్టీలు బాండ్ల రూపంలో చందాలు తీసుకోవచ్చనే విధానాన్ని బీజేపీ ప్రభుత్వమే తీసుకొచ్చిందన్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న వారు పార్టీలకు విరాళాలు ఇచ్చి తప్పించుకుంటున్నారన్నారు. 

శరత్‌‌‌‌చంద్రారెడ్డి అనే వ్యక్తి కేంద్రానికి రూ. 500 కోట్లు విరాళం ఇవ్వడం వల్లే ఆయనకు లిక్కర్‌‌‌‌ కేసులో బెయిల్ వచ్చిందన్నారు. మరో వ్యక్తి రూ. 100 కోట్లు ఇచ్చాడని దీంతో ఆయనకు కాంట్రాక్ట్‌‌‌‌ అప్పగించారని ఆరోపించారు. ఇదే విధంగా బీజేపీ వేల కోట్లు సేకరించిందన్నారు. రాముడి దయతోనే రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నామని చెప్పారు. 

నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో చర్చించి త్వరలోనే కరీంనగర్‌‌‌‌ ఎంపీ క్యాండిడేట్‌‌‌‌ను ప్రకటిస్తామని చెప్పారు. అంతకుముందు పలు గ్రామాల్లో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట పీసీసీ మెంబర్​ బొమ్మనపల్లి అశోక్‌‌‌‌రెడ్డి, కాంగ్రెస్​ మండల అధ్యక్షుడు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి, మాజీ అధ్యక్షుడు సుకినె సంతాజీ పాల్గొన్నారు.