ధర్మసాగర్, వెలుగు: కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు దేవాదుల ప్రాజెక్టులో కీలకమైన హనుమకొండ జిల్లా ధర్మసాగర్ రిజర్వాయర్ ను సెంట్రల్ టీమ్ పరిశీలించింది. సెంట్రల్ వాటర్ బోర్డు (సీడబ్ల్యూసీ), సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు (సీజీడబ్ల్యూబీ)కి సంబంధించిన అధికారులు శుక్రవారం దేవాదుల ఇన్చార్జి ఎస్ఈ సీతారాం నాయక్, ఈఈ మంగీలాల్, ఇతర అధికారులతో కలిసి ధర్మసాగర్ రిజర్వాయర్ ను సందర్శించారు.
ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన పైపులైన్, టన్నెల్, దేవన్నపేట పంప్ హౌజ్, రిజర్వాయర్ లో నీటి లభ్యత, ఆయకట్టు, మోటర్ల సామర్థ్యం, పనితీరుపై ఆరా తీశారు. మెయిన్ కాల్వలతో పాటు డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ, ఇతర టెక్నికల్ అంశాల గురించి తెలుసుకున్నారు. కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు సీడబ్ల్యూసీ, సీజీడబ్ల్యూసీ మెంబర్స్ దేవాదుల ప్రాజెక్టును విజిట్ చేసినట్లు అధికారులు తెలిపారు. రిజర్వాయర్ ను విజిట్ చేసిన వారిలో సీడబ్ల్యూసీ, సీజీడబ్ల్యూసీ మెంబర్స్ ఎన్.జ్యోతికుమార్, బైరి శ్రీనివాస్, డా.జి.ప్రవీణ్ కుమార్, ఆశీశ్ కుమార్ పాండే, డా.ఎస్.ఎస్.విటల తదితరులున్నారు.
