వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన
  • జయశంకర్ జిల్లాలో కేంద్ర బృందం పర్యటన

జయశంకర్ భూపాలపల్లి: ఇటీవల కురిసిన వర్షాలకు జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు వచ్చింది. మహా ముత్తారం మండలంలో పర్యటించిన కేంద్ర బృందం.. ఇటీవల కురిసిన వర్షానికి నష్టపోయిన పంటలు, ఇళ్లు, రోడ్లను పరిశీలించింది. వేల ఎకరాల పంట నీట మునగడంతో జరిగిన నష్టాన్ని అంచనా వేశారు. మహా ముత్తారం మండలం దౌట్ పల్లి గ్రామంలో పత్తి చేలలో ఇసుక  మేటలు పేరుకుపోయి పంట దెబ్బతిందని 75 మంది రైతులు కేంద్ర బృందానికి మొర పెట్టుకున్నారు. 

గోదావరి తీర ప్రాంతంలో పరిస్థితి మరీ దారుణంగా మారిన విషయాన్ని స్థానికులు కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోనే అత్యధిక తీర ప్రాంతం ఉందని చెప్పారు.  నీట మునిగిన భూముల వివరాలు నమోదు చేసుకోవడంలో తీవ్ర జాప్యం జరిగిందని కేంద్ర బృందం ముందు బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.  

కేంద్ర బృందంలో ఆర్థిక శాఖ డిప్యూటీ కార్యదర్శి పార్తిబన్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ జూట్‌ డెవలప్‌మెంట్‌ కె.మనోహరన్‌, కేంద్ర జలసంఘం డైరెక్టర్‌ రమేష్‌కుమార్‌, జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ ఎస్‌ఈ శివకుమార్‌ కుష్వాహ తదితరుల కమిటీ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. నిమ్మగూడెం సమీపంలో కాటారం మేడారం రహదారిని కేంద్ర బృందం. కాటారం నుంచి మేడారం రహదారి నిమ్మగూడెం వద్ద వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్డు, కల్వర్టును జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా కేంద్ర బృందానికి చూపించారు.