రూల్స్ పాటిస్తున్నాం.. సెంట్రల్ విస్టా పనులతో కాలుష్యం రాదు

రూల్స్ పాటిస్తున్నాం.. సెంట్రల్ విస్టా పనులతో కాలుష్యం రాదు

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పార్లమెంట్ కొత్త బిల్డింగ్ నిర్మాణ పనులపై వస్తున్న విమర్శల మీద కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పనులతో ఢిల్లీలో కాలుష్యం పెరిగే అవకాశాలు ఉన్నాయంటూ వచ్చిన వార్తలను ప్రభుత్వం ఖండించింది. అన్ని రకాల చర్యలు తీసుకున్నామంటూ సుప్రీంకోర్టుకు తెలిపింది. నిర్మాణ పనుల వల్ల వచ్చే దుమ్ము, ధూళితోపాటు పంట వ్యర్థాలను తగలబెట్టడంతో కాలుష్యం పెరిగిపోతోందంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. 

పార్లమెంట్ బిల్డింగ్ తోపాటు సెంట్రల్ విస్టా ఎవెన్యూ నిర్మాణ పనుల విషయంలో అన్ని రూల్స్ పాటిస్తున్నామని సుప్రీంకు కేంద్రం స్పష్టం చేసింది. కన్ స్ట్రక్షన్ పనుల వల్ల కాలుష్యం రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రాజెక్టు డైరెక్టర్ సుప్రీంకోర్టుకు తెలిపారు. యాంటీ స్మోగ్ గన్, మిస్ట్ స్ప్రే విధానం, దుమ్ము పైకి లేవకుండా మాగ్నేషియం క్లోరైడ్ చల్లడంతోపాటు కన్వేయర్ బెల్ట్ తో నిర్మాణ వ్యర్థాలను తరలించడం, తడి చేయడం వంటి చర్యలు చేపడుతున్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు. కాగా, గాలి కాలుష్యం పెరగడంతో భవన నిర్మాణాలపై విధించిన నిషేధాన్ని ఢిల్లీ సర్కార్ ఇటీవల తొలగించింది. ఎయిర్ క్వాలిటీ క్రమంగా పెరుగుతున్నా.. శాశ్వత కాలుష్య నియంత్రణ, నివారణ కోసం చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వానికి, కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.