హైదరాబాద్ లో భారీగా హవాలా డబ్బు స్వాధీనం

హైదరాబాద్ లో భారీగా హవాలా డబ్బు స్వాధీనం

హైదరాబాద్: నగరంలోని హిమాయత్ నగర్ లో  రూ. కోటి 27 లక్షల హవాలా డబ్బును టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ పి.రాధాకిషన్  తెలిపిన వివరాల ప్రకారం... హవాలా డబ్బు చేతులు మారుతోందన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ సెంట్రల్ జోన్ ఎస్ఐ సాయికిరణ్ నేతృత్వంలోని బృందం హిమాయత్ నగర్ లిబర్టీ క్రాస్ రోడ్స్ లో తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలోనే వారికి TS08HP3299 నెంబర్ గల హోండా యాక్టివా స్కూటీలో రూ.కోటి 27 లక్షలు లభించాయి. స్కూటీ ఓనర్ కె.ఫణికుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. 

మన్నె శ్రీనివాస్ అలియాస్ శ్రీను అనే వ్యక్తి వద్ద తాను కలెక్షన్ ఏజెంట్‌గా పనిచేస్తున్నానని నిందితుడు ఫణికుమార్ తెలిపాడు. మన్నె శ్రీనివాస్ నుంచి రూ.70 లక్షలు, సి.విశ్వనాథ్ చెట్టి నుంచి రూ.57 లక్షలు వసూలు చేసినట్లు నిందితుడు ఫణి కుమార్ తెలిపాడు. నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా మన్నె శ్రీనివాస్, విశ్వనాథ్ లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే వాళ్లు ఆ డబ్బుకు సంబంధించిన ఆధారాలు చూపించలేదని పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిందితులు ముగ్గురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.