మరో 10 లక్షల టన్నుల వడ్ల సేకరణకు లైన్‌‌ క్లియర్‌‌

మరో 10 లక్షల టన్నుల వడ్ల సేకరణకు లైన్‌‌ క్లియర్‌‌

ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

ఇప్పటికే 61.52 లక్షల టన్నుల ధాన్యం సేకరణ

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలో వానాకాలం వడ్ల కొనుగోళ్లకు కేంద్రం భరోసా కల్పించింది. ఇంకో ఆరు లక్షల టన్నుల బియ్యం తీసుకునేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు బియ్యం సేకరణ టార్గెట్‌ను పెంచుతూ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి జైప్రకాశ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించి 40లక్షల టన్నుల బియ్యం ఎఫ్‌సీఐ ద్వారా సేకరించేందుకు కేంద్ర రాష్ట్రాల మధ్య ఇదివరకే ఒప్పందం ఉన్న సంగతి తెలిసిందే. తాజా ఉత్తర్వుతో మొత్తం 46 లక్షల టన్నుల బియ్యం సేకరణకు అనుమతి లభించింది. రాష్ట్రంలో అక్టోబరు 25వ తేదీ నుంచి రెండు నెలలుగా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. మంగళవారం నాటికి 61.52 లక్షల టన్నుల సేకరణ పూర్తయింది. ధాన్యం కొనుగోళ్ల టార్గెట్‌ మించిపోవడంతో రాష్ట్ర సర్కార్ విజ్ఞప్తి మేరకు కేంద్రం మరో ఆరు లక్షల టన్నుల బియ్యం తీసుకుంటామని ఉత్తర్వులిచ్చింది. దీంతో ఈ వానాకాలం వడ్లు ఇంకో పది లక్షల టన్నుల కొనడానికి లైన్‌ క్లియరైంది. ఈ లెక్కన రాష్ట్రంలో  69.60 లక్షల టన్నుల వడ్ల వరకు పర్మిషన్ లభించింది. ఇప్పటికే 61.52 లక్షల టన్నుల ధాన్యం సేకరణ పూర్తవడంతో ఇంకో ఎనిమిది లక్షల టన్నులు కొనుగోలుకు అవకాశం కలిగింది. రాష్ట్రంలో ధాన్యం ఇంకా మిగిలినా.. అవసరానికి అనుగుణంగా టార్గెట్​మరింత పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి.
రాసి ఇయ్యక పోయినా కేంద్రం బియ్యం కొంటున్నది
కేంద్రంపై నెపం వేసి రాష్ట్ర సర్కారు వడ్ల కొనుగోళ్లు లేటు చేసింది. దీంతో పలువురు రైతులు వడ్ల కుప్పలపైనే ప్రాణాలు వదిలారు. కేంద్ర మంత్రి పార్లమెంట్‌ సమావేశాల్లో బిజీగా ఉన్నప్పుడు ఢిల్లీకి వెళ్లి అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదని రాష్ట్ర మంత్రులు రచ్చ చేశారు. వడ్ల కొనుగోళ్లపై రాష్ట్ర సర్కారుది మొదటినుంచి రాజకీయం చేస్తోంది. కేంద్రం రాసి ఇయ్యకపోయినా.. ముందుగా చెప్పిన 40 లక్షల టన్నుల బియ్యానికి తోడు ఇంకో 6 లక్షల టన్నులు తీసుకుంటామని ఆర్డర్స్ జారీ చేసింది. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత అడ్డగోలుగా వ్యవహరించిందో రైతులు, ప్రజలు గుర్తించారు. ‑వివేక్‌ వెంకటస్వామి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు.