తమిళనాడుకు కేంద్రం రూ.900 కోట్ల సాయం

తమిళనాడుకు కేంద్రం రూ.900 కోట్ల సాయం

న్యూఢిల్లీ: తమిళనాడులోని 4 జిల్లాల్లో ఇటీవలి వర్షాలకు 31 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం తెలిపారు. ఆ రాష్ట్రానికి కేంద్రం ఇప్పటికే రెండు విడతలుగా రూ.900 కోట్ల నిధులను విడుదల చేసిందన్నారు. ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రంలో అత్యాధునిక పరికరాలు ఉన్నాయని, ఇటీవలి వర్షాలను అంచనా వేయడానికి తోడ్పడ్డాయని తెలిపారు. 

తమిళనాడు వరదలను జాతీయ విపత్తుగా పరిగణించాలనే డిమాండ్​పై స్పందించిన నిర్మల.. ‘‘ఉత్తరాఖండ్ ​ప్రకృతి వైపరీత్యాల సందర్భం సహా.. ఇప్పటి వరకు జాతీయ విపత్తు అనే ప్రకటన ఎప్పుడూ చేయలేదు. ఏ రాష్ట్రంలోనైనా విపత్తును ప్రకటించడానికి కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి’’ అని గుర్తు చేశారు. కాగా, తమిళనాడులో ఇంత భారీ విపత్తు చోటుచేసుకున్నప్పుడు ఆ రాష్ట్ర సీఎం ఇండియా కూటమితో ఢిల్లీలో ఉన్నారని నిర్మల విమర్శించారు. కేంద్రం వరద సాయం కోసం తగినన్ని నిధులు ఇవ్వలేదని ఆరోపించిన సీఎం స్టాలిన్.. బాధితులను రాష్ట్ర సర్కారు ఆదుకుంటుందని పేర్కొన్నారు.