ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్​కు కేంద్ర కేబినెట్ ఆమోదం

ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్​కు కేంద్ర కేబినెట్ ఆమోదం

న్యూఢిల్లీ: నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు కేంద్ర కేబినెట్ దీపావళి బోనస్ ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను 78 రోజులకు సమానమైన శాలరీని ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్(పీఎల్బీ)గా ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. కేంద్రం నిర్ణయంతో ఆర్పీఎఫ్/ఆర్పీఎస్ఎఫ్ సిబ్బంది మినహా మొత్తం 11.27 లక్షల మంది నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు లబ్ధి చేకూరనుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. కేబినెట్ తీసుకున్న పలు నిర్ణయాలను మీడియాకు వివరించారు. పీఎల్బీ ప్రకటనతో రైల్వేపై రూ. 1,832.09 కోట్ల భారం పడుతుందన్నారు. బేసిక్​ పే ప్రకారం.. ఒక్కో ఉద్యోగికి ఒక్కో నెలకు గరిష్టంగా రూ.7 వేల చొప్పున 78 రోజులకు గరిష్టంగా రూ.17,951 వరకు పీఎల్బీ రూపంలో అందనుందన్నారు. ఏటా దీపావళికి ఉద్యోగులకు రైల్వే శాఖ పీఎల్బీని ప్రకటిస్తుంది. కేబినెట్ ఆమోదంతో ఈ ఏడాది కూడా ట్రాక్ మెయింటెనర్లు, డ్రైవర్లు, గార్డులు, స్టేషన్ మాస్టర్లు, సూపర్ వైజర్లు, టెక్నీషియన్లు, హెల్పర్లు, కంట్రోలర్లు, పాయింట్స్ మెన్, మినిస్టీరియల్ స్టాఫ్, ఇతర గ్రూపు సీ ఉద్యోగులకు బోనస్ అందనుంది. రైల్వేలో  ఉద్యోగులు అద్భుతమైన పనితీరును కనపర్చారని కేబినెట్ ప్రశంసించింది. లాక్ డౌన్ టైమ్​లో ఫుడ్, ఫర్టిలైజర్లు, బొగ్గు, ఇతర వస్తువుల రవాణాకు ఆటంకం కలగకుండా రైల్వే సిబ్బంది గణనీయమైన సేవలు చేశారని కొనియాడింది.  
 
కేంద్ర కేబినెట్ ఇతర నిర్ణయాలు ఇవే..

‘ప్రైమ్ మినిస్టర్స్ డెవలప్ మెంట్ ఇనీషియేటివ్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజియన్’ పేరుతో కొత్త పథకానికి కేంద్ర కేబినెట్ ఓకే చెప్పింది. 15వ ఆర్థిక సంఘంలో మిగిలిన నాలుగేళ్ల కాలం (2022–23 నుంచి 2025–26 వరకు) ఈ స్కీంను అమలుచేసేందుకు ఆమోదం తెలిపింది.మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీల చట్టం, 2002ను సవరించి, 97వ రాజ్యాంగ సవరణ నిబంధనలను చేర్చేందుకు తీసుకొచ్చిన మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీల (సవరణ) బిల్లు, 2022ను కేబినెట్ ఆమోదించింది. గుజరాత్​లోని దీన్ దయాళ్ పోర్టులో టూనా టేక్రా వద్ద ఓ కంటైనర్ టర్మినల్ అభివృద్ధికి కూడా కేంద్ర కేబినెట్ ఓకే చెప్పింది.రూ.4,243.64 కోట్ల అంచనా వ్యయంతో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ పద్ధతిలో దీనిని డెవలప్ చేయాలని నిర్ణయించింది.  టెర్మినల్ నిర్వహణదారుకు రూ.4,243.64 కోట్లు ఖర్చవుతుందని, కామన్ యూజర్ ఫెసిలిటీస్ కోసం పోర్ట్ అథారిటీకి రూ.296.20 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు.

దేశంలోని పలు ప్రాంతాలను సందర్శించేందుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే లీవ్ ట్రావెల్ కన్సెషన్(ఎల్టీసీ) సౌలత్​ను ఇంకో రెండేండ్లు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అర్హులైన ఉద్యోగులు వేతనంతో కూడిన సెలవుతో పాటు తిరుగు ప్రయాణానికయ్యే టికెట్​ ఖర్చులను రీయింబర్స్​మెంట్ కింద పొందుతారు. ఎల్టీసీ స్కీం కింద ఉద్యోగులకు.. వాళ్లు పనిచేస్తున్న ప్రాంతం నుంచి ఈశాన్య ప్రాంతాలు, కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకాశ్మీర్, లడఖ్, అండమాన్ నికోబార్ దీవులకు హాలీడే ట్రిప్​కు వెళ్లేందుకు  ప్రభుత్వం అనుమతిస్తుంది. విమానంలో ఎకానమీ క్లాస్​లో ప్రయాణాలకూ ఇది వర్తిస్తుందని పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్ 26 నుంచి 2024 సెప్టెంబర్25​ దాకా వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.