- అన్ని రాష్ట్రాల లోక్‌సభ స్థానాలు 50% పెరుగుతయ్: అమిత్ షా
- దక్షిణాదిన ఐదు రాష్ట్రాల సీట్లు 129 నుంచి 195కు పెరుగుతయ్
- తెలంగాణకు మరో 9, ఏపీకి మరో 13 స్థానాలు
- మొత్తం లోక్సభ సీట్లు 850కి పెరగొచ్చని వివరణ.. ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం
- అఖిలేశ్ యాదవ్ తన పార్టీ టికెట్లన్నీ ముస్లింలకే ఇచ్చుకుంటే అభ్యంతరం లేదని ఎద్దేవా
- మహిళలకు మొత్తం 272 సీట్లు రిజర్వ్ అవుతాయి: మేఘ్వాల్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్)తో పెరగనున్న లోక్ సభ స్థానాల సంఖ్యపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. డీలిమిటేషన్ తర్వాత అన్ని రాష్ట్రాల లోక్‌సభ స్థానాలు 50 శాతం పెరుగుతాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గురువారం లోక్‌సభలో ప్రకటించారు.
దక్షిణాది రాష్ట్రాల్లోనూ సీట్లు, లోక్‌సభలో సీట్ల వాటా శాతం పెరుగుతుందని తెలిపారు. తెలంగాణలో లోక్సభ సీట్ల సంఖ్య ప్రస్తుత 17 స్థానాల నుంచి 26 కు, ఏపీలో సీట్ల సంఖ్య 25 నుంచి 38కి, కర్నాటకలో 28 నుంచి 42కు, తమిళనాడులో 39 నుంచి 59కి, కేరళలో 20 నుంచి 30కి పెరుగుతున్నాయని వారు వెల్లడించారు. అలాగే లోక్సభ సీట్లలో తెలంగాణ వాటా 3.13 శాతం నుంచి 3.18 శాతానికి, ఏపీ వాటా 4.6 శాతం నుంచి 4.65 శాతానికి, తమిళనాడు వాటా 7.18 శాతం నుంచి 7.23 శాతానికి చేరుతుందన్నారు. కర్నాటక సీట్ల వాటా 5.1 శాతంతో స్థిరంగా, కేరళ వాటా 3.67 శాతంగా మార్పు లేకుండా ఉంటుందని వివరించారు.
రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు కోసం ప్రతిపాదించిన ఈ విధానం “నష్టం లేని” నమూనా అని అమిత్ షా చెప్పారు. దీనివల్ల ఏ ప్రాంతం కూడా రాజకీయ ప్రాతినిధ్యాన్ని కోల్పోయే అవకాశం లేదన్నారు. సభ మొత్తం బలాన్ని 850 సీట్లకు పెంచడం ద్వారా, మహిళా రిజర్వేషన్లకు అవకాశం కల్పించడంతో పాటు, జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసినందుకు నష్టపోతామని భావిస్తున్న రాష్ట్రాల్లోనూ సీట్లు పెరుగుతాయన్నారు.
దక్షిణాదిన ఆయా రాష్ట్రాల సీట్లు, వాటా శాతం డీలిమిటేషన్ తో ఎలా పెరుగుతాయో కూడా ఆయన వివరించారు. కఠినమైన జనాభా స్థిరీకరణ రికార్డులు కలిగిన తెలంగాణ, కేరళ వంటి రాష్ట్రాలు కూడా స్పష్టమైన ప్రయోజనాన్ని పొందుతాయన్నారు.
- 850 సీట్ల సంఖ్య ఇలా వచ్చింది..
నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాలు తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నాయని అమిత్ షా మండిపడ్డారు. పునర్విభజన తర్వాత దక్షిణాది కూడా ప్రయోజనం పొందుతుందన్నారు. ప్రతిపాదిత 50 శాతం సీట్ల పెరుగుదల వల్ల దక్షిణాదిన ప్రతి రాష్ట్రానికి ఎక్కువ సీట్లు వస్తాయని తెలిపారు. ఉదాహరణకు.. తమిళనాడుకు మరో 20 సీట్లు, కేరళకు 10, తెలంగాణకు 9, ఆంధ్రప్రదేశ్‌కు 13 సీట్లు వస్తాయని చెప్పారు. ఉత్తరప్రదేశ్ తర్వాత లోక్‌సభలో రెండో అత్యధిక ఎంపీలు ఉన్న మహారాష్ట్ర మరో 24 సీట్లను పొందుతుందన్నారు. 5 దక్షిణాది రాష్ట్రాల్లోని మొత్తం లోక్‌సభ స్థానాల సంఖ్య ప్రస్తుతం ఉన్న 129 నుంచి 195కి పెరుగుతుందని, వాటా శాతం 23.76 శాతం నుంచి 23.87 శాతానికి పెరుగుతుందని షా చెప్పారు.
"850 అనే సంఖ్య ఎక్కడి నుంచి వచ్చిందని వారు అడిగారు. ఉదాహరణకు.. 100 సీట్లు ఉండి మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాలంటే, మొత్తం సీట్లను 50 శాతం పెంచితే అది150 అవుతుంది. 150లో 33 శాతం రిజర్వేషన్ వర్తింపజేసినప్పుడు, అది తిరిగి 100 సీట్లకు (జనరల్) వస్తుంది. కాబట్టి, ప్రస్తుతం ఉన్న 543 స్థానాలకు మరో 50 శాతం పెరుగుదల ఉంటుంది. 33 శాతం మహిళలకు రిజర్వ్ చేసినప్పుడు, అన్ని 543 సీట్లు మహిళలు కూడా పోటీ చేయగలిగేలా అందుబాటులో ఉంటాయి. అలాగే 850 అనేది ఒక రౌండ్ ఫిగర్. ఖచ్చితమైన సంఖ్య 816 అవుతుంది" అని షా పేర్కొన్నారు.
- ముస్లిం కోటా రాజ్యాంగ విరుద్ధం
మత ప్రాతిపదికన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించబోమని, అటువంటి కోటా రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం తెలిపారు. మహిళా కోటా చట్టం సవరణ, పునర్విభజన కమిషన్ ఏర్పాటు కోసం లోక్‌సభలో మూడు బిల్లులను ప్రవేశపెట్టిన సందర్భంగా జరిగిన 40 నిమిషాల వాడివేడి చర్చలో షా మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న జనాభా గణన ప్రక్రియలో జనాభా లెక్కింపుతో పాటు కుల గణన కూడా నిర్వహిస్తామని ఆయన చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీ నాయకులు అఖిలేశ్ యాదవ్, ధర్మేంద్ర యాదవ్ ముస్లింలకు కోటా ఇవ్వాలని మాట్లాడిన తర్వాత షా తీవ్రంగా స్పందించారు.
‘మత ప్రాతిపదికన ముస్లిం మహిళలకు రిజర్వేషన్లు కల్పించే ప్రశ్నే తలెత్తదు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడానికి మన రాజ్యాంగం ఏమాత్రం అనుమతించదు. మత ప్రాతిపదికన ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వబోమనే మా ప్రభుత్వ నిర్ణయాన్ని స్పష్టం చేయాలనుకుంటున్నాను. అటువంటి రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధం’ అని ఆయన స్పష్టం చేశారు. కులగణన జరపాలని తాము డిమాండ్ చేస్తామని సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు అంటున్నారని, అయితే కులగణన జరపాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని, జనాభా లెక్కింపుతో పాటే అది జరుగుతుందని వారికి తెలియజేస్తున్నానని హోం మంత్రి చెప్పారు.
‘ప్రస్తుతం గృహాల లెక్కింపు జరుగుతోంది, గృహాలకు ఎటువంటి కులం ఉండదు. సమాజ్‌వాదీ పార్టీకి అవకాశం ఇస్తే, వారు గృహాలకు కూడా కులాన్ని నిర్ణయిస్తారు’ అని ఆయన ఎద్దేవా చేశారు. ‘సమాజ్‌వాదీ పార్టీ తన టిక్కెట్లన్నీ ముస్లిం మహిళలకే ఇచ్చుకుంటే మాకేం అభ్యంతరం ఉంటుంది, మాకు అస్సలు అభ్యంతరంలేదు’ అని కూడా షా పేర్కొన్నారు.
- మహిళలకు 272 సీట్లు రిజర్వ్ చేస్తాం: మేఘ్వాల్
డీలిమిటేషన్ తర్వాత లోక్‌సభ బలం ప్రస్తుత 543 సీట్ల నుంచి 850కి పెరుగుతుందని.. వీటిలో 272 సీట్లను మహిళలకు రిజర్వ్ చేస్తామని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ చెప్పారు. మహిళా కోటా అమలువల్ల పురుషులకు గానీ, ఏ రాష్ట్రానికి గానీ ఎలాంటి నష్టం కలగదని తెలిపారు. గురువారం లోక్ సభలో మహిళా కోటా చట్ట సవరణ, ఇతర బిల్లులపై చర్చ సందర్భంగా మేఘ్వాల్ మాట్లాడారు.
ఏ రాష్ట్రమూ నష్టపోకుండా, మహిళలకు చట్టసభల్లో 33% సీట్లను కేటాయించేందుకు ఇదే సులభమైన ఫార్ములా అని చెప్పారు. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళా కోటాలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన మహిళలకు కూడా రిజర్వేషన్ ఉంటుందన్నారు. నారీ శక్తి వందన్ అధినియం, 2023 ప్రస్తుత రూపంలోనే కొనసాగితే, 2026 తర్వాత అందుబాటులోకి వచ్చే జనాభా లెక్కల డేటాపై ఆధారపడి ఉండటం వల్ల 2029లో లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు నియోజకవర్గాల రిజర్వేషన్ సాధ్యంకాదన్నారు. అందుకే రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకువచ్చామని, అన్ని పార్టీలు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు.

