న్యూఢిల్లీ: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించి ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) సమర్పించిన ప్రాథమిక నివేదికలో పైలట్ తప్పిదమే ప్రమాదానికి కారణమని నిందించలేదని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు సెంట్రల్ గవర్నమెంట్ వివరణ ఇచ్చింది. కాగా, 2025, జూన్ 12న గుజరాత్‌లోని అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లోనే కుప్పకూలిన విషయం తెలిసిందే.
ఈ ఘటనలో దాదాపు 270 మంది మరణించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన AAIB.. విమానం ఫ్యూయల్ స్విచ్‌లు టేకాఫ్ తర్వాత ఒకేసారి రన్ మోడ్ నుంచి కటాఫ్‌కి మారడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక రిపోర్టులో పేర్కొంది. ఏఏఐబీ ప్రాథమిక రిపోర్ట్ ఆధారంగా.. ఎయిర్ ఇండియా కెప్టెన్ సుమీత్ సబర్వాల్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని నేషనల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
విచారణ పూర్తి కాకముందే తన కొడుకును బ్లేమ్ చేస్తున్నారంటూ కెప్టెన్ సుమీత్ సబర్వాల్ తండ్రి పుష్కర్ రాజ్ సబర్వాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో న్యాయమైన, పారదర్శకమైన, సాంకేతికంగా దర్యాప్తు జరపాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రాథమిక విచారణ ఆధారంగా పైలట్లను నిందించడం దురదృష్టకరమని మండిపడింది.
పైలట్లలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారని సూచించే మీడియా నివేదికలను చాలా బాధ్యతారహితమైనవిగా పేర్కొంది. ప్రాథమిక నివేదిక ఆధారంగా పైలట్లను నిందిస్తే.. తుది విచారణలో వారి తప్పు లేదని తేలితే ఏం చేస్తారని ప్రశ్నించింది. అనంతరం కేంద్ర ప్రభుత్వం, డీజీసీఏకు అఫిడవిట్ దాఖలు చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు నోటీసులకు తాజాగా కేంద్ర ప్రభుత్వం సమాధానమిచ్చింది. ఏఏఐబీ ప్రాథమిక నివేదికలో పైలట్ తప్పిదమే ప్రమాదానికి కారణమని నిందించలేదని పేర్కొంది.
