- లోక్‌సభలో ఎంపీ వంశీకృష్ణ ప్రశ్న
- సమాధానమిచ్చిన మంత్రి అనుప్రియ
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో జరిగిన సిగాచి ఇండస్ట్రీస్ పేలుడు ఘటన దేశ ఫార్మా ఎగుమతులపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపలేదని కేంద్రం స్పష్టం చేసింది. సిగాచి పరిశ్రమ ప్రమాదం అనం తరం ఫార్మా ఎగుమతులపై పడ్డ ప్రభావంపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ లోక్‌సభలో ప్రశ్న లేవనెత్తారు. 2025 జూలై 1న సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు మండలం పాశమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్‌లో జరిగిన పేలుడులో 36 మంది కార్మికులు చనిపోయిన విషయాన్ని గుర్తుచేశారు. సిగాచి ప్రమాదం తర్వాత ఔషధ ఆమోదాల నిలిపివేత, దేశంలో తయారీ సౌకర్యాలపై పెరిగిన నిఘా, ఫార్మాస్యూటికల్స్‌ను దిగుమతి చేసుకునే దేశాలతో జరిపిన వాణిజ్య చర్చలు ఏమిటని కేంద్రాన్ని ప్రశ్నించారు.
దీనిపై కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ రాతపూర్వక సమాధానమిచ్చారు. ఈ ఘటన తర్వాత కూడా 2025 నాటికి ఫార్మా ఎగుమతులు సుమారు 9.7% వృద్ధి చెంది 30.45 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని మంత్రి వివరించారు. నాణ్యత, భద్రతా ప్రమాణాల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు.
