పన్నెండేండ్లలో తెలంగాణకు 12 లక్షల కోట్లు ఇచ్చాం : బీజేపీ ఎంపీ లక్ష్మణ్

పన్నెండేండ్లలో తెలంగాణకు 12 లక్షల కోట్లు ఇచ్చాం : బీజేపీ ఎంపీ లక్ష్మణ్
  •     బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కామెంట్
  •     రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనకు విసిగి ప్రజలు కాంగ్రెస్ ను ఎన్నుకున్నారని వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు: ప్రధాని మోదీ పాలనలో పన్నెండేడ్లలో తెలంగాణకు రూ.12 లక్షల కోట్లు ఇచ్చామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి అనుకూలంగా తీర్పు ఇవ్వకపోయినా.. ఎన్నికల వరకు రాజకీయం, ఆ తర్వాత టీం ఇండియా ఆలోచనతో మోదీ పని చేస్తున్నట్టు చెప్పారు. గురువారం రాజ్యసభలో అమరావతి చట్ట బద్ధత బిల్లుపై చర్చలో ఆయన మాట్లాడారు. 

‘గత పన్నెండేండ్లలో తెలంగాణలో మూతపడ్డ రామగుండ ఎరువుల కర్మాగారం రీఓపెన్ చేశాం. హనుమకొండలో వ్యాగన్ ఫ్యాక్టరీ, రైల్వేకు పెద్ద ఎత్తున నిధులు, జాతీయ రహదారుల అభివృద్ధికి సహకరించాం. బీబీనగర్ లో రూ.1,100 కోట్లతో ఎయిమ్స్, ట్రైబల్ వర్సిటీ ఏర్పాటు, సిద్దిపేట, కొమురవెళ్లికి రైల్వే స్టేషన్లు ఇచ్చాం’ అని తెలిపారు. 

తెలంగాణ ఏర్పడిన పన్నెండేండ్లలో బీఆర్ఎస్ పదేండ్ల అవినీతి, అహంకారం, కుటుంబ పాలనకు విసిగి మార్పుకోసం కాంగ్రెస్ ను ఎన్నుకున్నారని లక్ష్మణ్ చెప్పారు. అంతేతప్ప కాంగ్రెస్ నైతికంగా గెలిచింది కాదన్నారు. అయితే, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు మాత్రం తెలంగాణ నుంచి ఢిల్లీకి మూటలు మోస్తున్నారని ఆరోపించారు. కప్పం కడుతూ రాష్ట్ర సంపదను దోచిపెడుతున్నారని విమర్శించారు. అందుకే రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ను తెచ్చుకుంటారని ధీమా వ్యక్తం చేశారు.

1999 లో తాను తొలిసారి ఎమ్మెల్యేగా సీఎం చంద్రబాబుతో కలిసి పనిచేశానని లక్ష్మణ్ గుర్తుచేశారు. హైదరాబాద్ ను సైబరాబాద్ గా గొప్ప హైటెక్ సిటీని నిర్మించారని ప్రశంసించారు. 2014 లోనే అమరావతి శంకుస్థాపనకు ప్రధాని పార్లమెంట్ ప్రాంగణంలోని మట్టిని, యమునా నీళ్లను ఇచ్చారని గుర్తు చేశారు. రెండు రాష్ట్రాల అభవృద్ధికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. కానీ, వైఎస్సార్ సీపీ మూడు రాజధానుల పేరిట మూడు ముక్కలు ఆడిన తీరుతో ప్రపంచం మొత్తం నివ్వర పోయిందన్నారు.