
- ప్రారంభించిన మంత్రులు వివేక్, లక్ష్మణ్
- సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కాలేజీగా అప్‌గ్రేడ్
- మైనారిటీ స్టూడెంట్లను ఉన్నత స్థాయిలో నిలబెడ్తాం: మంత్రి అడ్లూరి
- సీవోఈ కాలేజీలో అత్యాధునిక ల్యాబ్స్: మంత్రి వివేక్
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ మైనారిటీ గురుకులాల్లో మరో సీవోఈ (సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్) కాలేజీ స్టార్టయ్యింది. హైదరాబాద్ సిటీలోని ఎర్రగడ్డ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర్లో ఉన్న మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ గర్ల్స్ కాలేజ్‌ను సీవోఈ కాలేజ్‌గా అప్ గ్రేడ్ చేస్తూ మంత్రులు వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడారు.
సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కాలేజీల ద్వారా మైనారిటీ స్టూడెంట్లకు ఉన్నత విద్యా అవకాశాలు దక్కుతాయన్నారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మైనారిటీలకు విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాం. ప్రతి ముస్లిం మైనారిటీ స్టూడెంట్ను ఉన్నత స్థాయిలో నిలబెట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. అత్యాధునిక సదుపాయాలతో సీవోఈ కాలేజ్‌ను ప్రారంభించినం.
విద్య అనేది సామాజిక సమానత్వానికి, ఆర్థిక స్వావలంబనకు ప్రధాన శక్తిలాంటిది. ఈ కాలేజీ.. ఫ్యూచర్లో “రాష్ట్ర మైనారిటీల విద్యా పునరుజ్జీవనం లో కీలక మైలురాయిగా నిలుస్తది. ఐఐటీ, నీట్, ఏఐఐఎంఎస్, క్లాట్, ఎన్డీఏ, సీయూఈటీ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి సీవోఈ కాలేజీలు ఎంతో ఉపయోగపడ్తాయి. అవసరమైన వసతి, భోజనం, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, లైబ్రరీ వంటి సదుపాయాలు కల్పించాం’’అని మంత్రి అడ్లూరి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 205 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలు ఉన్నాయని, వీటిలో సుమారు 1.33 లక్షలకు పైగా స్టూడెంట్లు చదువుకుంటున్నారని చెప్పారు.
40 శాతానికి పెరిగిన మైనారిటీ విద్యా బడ్జెట్: మంత్రి వివేక్ వెంకటస్వామి
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ సారథ్యంలో మైనారిటీ విద్యా బడ్జెట్ 40 శాతానికి పెరిగిందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మైనారిటీ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ‘‘ప్రొఫెషనల్ కోర్సుల్లో మైనారిటీ స్టూడెంట్ల అడ్మిషన్లు.. గతంతో పోలిస్తే 22% పెరిగింది. సీవోఈ కాలేజీల్లో చదివిన స్టూడెంట్లు.. రెండేండ్లలో నీట్, జేఈఈ, ఎన్డీఏ సీట్లు సాధించారు. ఎర్రగడ్డలో కొత్తగా ప్రారంభించిన సీవోఈ కాలేజీలో అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ బోర్డులు, సైన్స్ ప్రాక్టికల్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేశాం.
సాంకేతిక విద్య, మానవతా విలువలు, సృజనాత్మకత అనే ఈ 3 అంశాల ఆధారంగా ప్రభుత్వ విద్యా విధానం కొనసాగుతున్నది’’అని వివేక్ అన్నారు. సదుపాయాలపరంగా రాష్ట్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ వ్యవస్థ దేశంలోనే ఆదర్శనీయమని తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రంలో కనీసం ఒక సీవోఈ కాలేజ్ ఏర్పాటు లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. మైనారిటీ స్టూడెంట్లు ప్రభుత్వ, టెక్నాలజీ రంగాల్లో రాణిస్తున్నారని, సివిల్ సర్వీసెస్ జాబ్‌కు పోటీపడుతున్నారని పేర్కొన్నారు.