- రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పనితీరుకు కేంద్రం ప్రశంస
- ప్రోత్సాహకంగా రూ.200 కోట్ల అదనపు నిధులు మంజూరు
హైదరాబాద్, వెలుగు: మాతా-శిశు ఆరోగ్య సేవల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అత్యుత్తమ పనితీరు కనబరిచిందని హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు ప్రోత్సాహకంగా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.200 కోట్ల అదనపు నిధులను మంజూరు చేసిందని సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఈ అదనపు నిధులను రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటల్స్‌లో మాతా-శిశు ఆరోగ్య సేవలను మెరుగుపరిచేందుకు వినియోగించనున్నట్లు స్పష్టం చేశారు. కేంద్ర నిధులతో ఎంపిక చేసిన హాస్పిటల్స్‌లోని లేబర్ రూమ్‌లు, ఆపరేషన్ థియేటర్లను జాతీయ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఆధునీకరించేందుకు పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
వీటితో పాటు మిడ్ వైఫరీ -లెడ్ కేర్ యూనిట్లు, కంగారూ మదర్ కేర్ (కేఎంసీ) వార్డులు, లాక్టేషన్ మేనేజ్‌మెంట్ యూనిట్లను కూడా ఆయా దవాఖానల్లో ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. కేంద్రం అందించిన ఈ నిధులు రాష్ట్రంలో మాతృ, నవజాత శిశు మరణాలను తగ్గించడంలో ఉపయోగపడతాయన్నారు.
ప్రతి ప్రభుత్వ హాస్పిటల్‌లో సామాన్య ప్రజలకు నాణ్యమైన మాతా-శిశు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో ఈ నిధులు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ నిధులతో అధిక ప్రసవాలు జరిగే ప్రభుత్వ హాస్పిటల్స్‌లో తల్లి, గర్భస్థ శిశువు ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించేలా అడ్వాన్స్‌డ్ ఎక్విప్మెంట్‌తో కూడిన వ్యవస్థలను అందుబాటులోకి తేనున్న ట్లు వెల్లడించారు.
