ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించేందుకు బీజేపీ కుట్ర : అతిషి

ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించేందుకు  బీజేపీ కుట్ర :  అతిషి

ఢిల్లీలో త్వరలో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ సర్కార్ ఆరోపించింది. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు రాజకీయ కుట్ర జరుగుతోందని విశ్వసనీయ వర్గాల ద్వారా తమకు తెలిసిందని ఢిల్లీ మంత్రి అతిషి అన్నారు.  ఎన్నికలు తేదీ ప్రకటించినప్పటి నుండి అధికారుల బదిలీలు,  నియామకాలు లేవన్నారు.  

 ప్రభుత్వ కార్యక్రమాలకు  అధికారులు  హాజరుకావడం మానేశారని చెప్పారు.   వివిధ శాఖల్లో ఖాళీలు ఉన్నప్పటికీ ఢిల్లీలో సీనియర్ ఐఏఎస్ అధికారుల పోస్టింగ్‌లు కొన్ని నెలలుగా నిలిచిపోయాయని అతిషి తెలిపారు. కేజ్రీవాల్‌ను నకిలీ కేసులో అరెస్టు చేశారని..  ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర జరుగుతోందని ఆమె అన్నారు.  

కేజ్రీవాల్ ప్రైవేట్ సెక్రటరీని తొలగించడం కూడా కుట్రలో భాగమేనని అతిషి అన్నారు. అయితే ఆమె ఆరోపణలను బీజేపీ అధికార ప్రతినిధి హరీష్ ఖురానా  కొట్టిపారేశారు.  ఆప్ సర్కార్ రోజుకో కొత్త కథ వండుతోందని విమర్శించారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చిలో సీఎం  కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది.