కరువుపై కేంద్రం సైలెన్స్.. 365 మండలాల్లో ఎండిపోయిన పంటలు

 కరువుపై కేంద్రం సైలెన్స్.. 365 మండలాల్లో ఎండిపోయిన పంటలు
  • రిపోర్టు పంపి 15 రోజులైనా కదలిక లేదు
  • ఇప్పటికీ రాని కేంద్ర పరిశీలన బృందాలు
  • వరి కోతలు పూర్తయితే నష్టం లెక్కెట్ల?
  • రూ.20 వేల కోట్ల సాయం కోరిన రాష్ట్రం
  • అసెంబ్లీ తీర్మానానికీ స్పందన కరువు

 

హైదరాబాద్, వెలుగు: ఎల్‌‌‌‌నినో ప్రభావంతో రాష్ట్రంలో 365 మండలాల్లో వర్షాభావం వల్ల పంటలు ఎండిపోయి రైతులు అల్లాడుతుంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికీ ఎలాంటి స్పందన రాలేదు. కరువు తీవ్రతపై రాష్ట్ర ప్రభుత్వం 10 నుంచి 15 రోజుల కిందటే సమగ్ర నివేదిక పంపింది. వారం కిందటే కరువు మండలాలను ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. అయినా క్షేత్రస్థాయిలో నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రం ఇప్పటివరకు బృందాలను పంపలేదు.  ప్రస్తుతం గ్రామాల్లో వరి కోతలు వేగంగా సాగుతున్నాయి. కేంద్ర బృందాలు వచ్చే సరికి కోతలు పూర్తయితే ఎండిపోయిన పంట నష్టాన్ని ఎలా అంచనా వేస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో భారీ వరదలతో తీవ్ర నష్టం వాటిల్లినప్పుడూ కేంద్రం సాయం చేయలేదని, ఇప్పుడు కరువు విషయంలోనూ అదే వివక్ష చూపుతోందని అధికార యంత్రాంగం, రైతు సంఘాలు మండిపడుతున్నాయి.

నిబంధనలు ఏం చెబుతున్నయ్?

వర్షాభావంతో పంటలు ఎండిపోతే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధ్యయనం చేసి కరువు మండలాలను గుర్తిస్తుంది. వర్షపాతం లోటు, రిజర్వాయర్లలో నీటిమట్టాలు, శాటిలైట్ డేటా, సాగు విస్తీర్ణంలో తగ్గుదల వంటి గణాంకాల ఆధారంగా కరువును లెక్కిస్తారు. వీటిని కేబినెట్‌‌‌‌లో సమీక్షించి జీవో ద్వారా కరువు మండలాలను నోటిఫై చేస్తారు. 

రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసింది. నిబంధనల ప్రకారం విపత్తు నష్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి భరించాల్సి ఉంటుంది. దీంతో కరువు మార్గదర్శకాల మేరకు కేంద్ర సాయం కోరుతూ రాష్ట్రం నివేదిక పంపింది. రాష్ట్రం నుంచి కరువు నివేదిక అందగానే కేంద్ర వ్యవసాయ, హోం, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులతో కూడిన అంతర మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం (ఐఎంసీటీ) కరువు ప్రాంతాల్లో పర్యటించాల్సి ఉంటుంది.

ఈ బృందాలు జిల్లాల్లో పర్యటించి, నెర్రెలు బారిన పొలాలను స్వయంగా పరిశీలించి, రైతులతో మాట్లాడి నష్టాన్ని అంచనా వేస్తాయి. ఆ నివేదిక ఆధారంగానే జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి రాష్ట్రానికి ఇవ్వాల్సిన సాయాన్ని కేంద్రం ఖరారు చేస్తుంది. బృందాలు వెంటనే వచ్చి నివేదిక ఇస్తే నిధులు త్వరగా వస్తాయి. పంట కాలం ముగింపు దశకు వచ్చినా బృందాలను పంపకపోవడంపై, రాష్ట్రం నుంచి ఉన్న కేంద్ర మంత్రులు ఆ దిశగా చొరవ తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

ఎకరాకు రూ.10 వేలు ఇవ్వాలె

కరువుపై రాష్ట్ర శాసనసభలో అధికార, విపక్షాలు చర్చించి, కేంద్రం తక్షణమే ఆదుకోవాలని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి. ఆ తీర్మానాన్ని ప్రభుత్వం కేంద్రానికి పంపింది. కరువు సాయం కింద రూ.20 వేల కోట్లు ఇవ్వాలని కోరింది.  

వరదలప్పుడూ ఇంతే

గతంలో రాష్ట్రంలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో వేల ఎకరాల్లో పంటలు మునిగి, రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయినప్పుడూ కేంద్రం ఇదే తీరు ప్రదర్శించిందని అధికారులు గుర్తుచేస్తున్నారు. రాష్ట్రం లేఖల మీద లేఖలు రాసినా రూపాయి సాయం ప్రకటించలేదని, కేంద్ర అధికారులు వచ్చి చూసి వెళ్లడం తప్ప పైసా విదల్చలేదని విమర్శిస్తున్నారు. వరి కోతలు పూర్తయితే పొలాలు బీడుగా కనిపిస్తాయే తప్ప పంట నష్టాన్ని నిరూపించడం సాధ్యం కాదని, సాంకేతిక కారణాలు చూపి సాయంలో కోత పెట్టేందుకే కేంద్రం ఆలస్యం చేస్తోందని రైతులు మండిపడుతున్నారు.

తీర్మానంలోని అంశాలు ఇవే

  •     365 మండలాల్లో ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.10 వేల చొప్పున ఇన్‌‌పుట్ సబ్సిడీ కోసం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి.
  •     పల్లెల్లో వలసలను అరికట్టేందుకు ఉపాధి హామీ పనిదినాలను 100 నుంచి 150 రోజులకు పెంచాలి
  •     వేసవి తాగునీటి ఎద్దడి, పశుగ్రాసం కొరత తీర్చేందుకు ప్రత్యేక గ్రాంట్లు మంజూరు చేయాలి
  •     రైతుల పాత పంట రుణాలను రీషెడ్యూల్ చేయాలి, బ్యాంకులు బలవంతపు వసూళ్లు  చేయొద్దని ఆదేశించాలి