భద్రాద్రి జిల్లాలో కేంద్ర ఆర్థిక శాఖ అధికారి పర్యటన ..రాజుపేటలో కౌజు పిట్టల పెంపకం యూనిట్ సందర్శన

భద్రాద్రి జిల్లాలో కేంద్ర ఆర్థిక శాఖ అధికారి పర్యటన ..రాజుపేటలో కౌజు పిట్టల పెంపకం యూనిట్ సందర్శన
  • కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్ తో కలిసి వివిధ పనుల పరిశీలన

ములకలపల్లి, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో కేంద్ర ఆర్థిక శాఖ బృంద సభ్యుడు సోమవారం పర్యటించారు.   కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి ప్రభారి అధికారి సాల్మన్ ఆరోక్య రాజ్..  జిల్లా కలెక్టర్ జితేశ్​వి పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్ తో కలిసి పరిశీలించారు. 

ముందుగా మాధారంలో నాయకపోడు ట్రైబ్ హ్యాండ్ క్రాఫ్ట్ యూనిట్ ను సందర్శించారు. అనంతరం ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కింద మంగపేట పీహెచ్ సీకి వెళ్లి సెంటర్ ప్రహరీ నిర్మాణ పనులను చూశారు. 

మెడికల్ ఆఫీసర్ సాయి కళ్యాణ్ తో ఓపీ సేవలు, మెడికల్ టెస్టులు, మలేరియా కేసులకు సంబంధించి చికిత్సపై చర్చించారు. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ కార్యాచరణలో భాగంగా ఆరోగ్య సేవల నాణ్యతను అంచనా వేసి, మెరుగుదల అవసరమైన ప్రాంతాలను గుర్తించేందుకు సందర్శనకు వచ్చామని కేంద్ర అధికారి తెలిపారు. 

రాజుపేటలో ఐకేపీ ఆధ్వర్యంలోని కౌజు పిట్టల పెంపకం యూనిట్ ను సందర్శించి లబ్ధిదారులతో మాట్లాడారు.  మొగరాలగుప్పలో వెదురు, మునగ సాగు రైతులతో మాట్లాడారు. కస్తూర్బా గాంధీ స్కూల్ విద్యార్థినులతో కలసి భోజనం చేశారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇటీవల రూ 45 లక్షలతో చేపట్టిన క్లాస్ రూమ్స్ మరమ్మతు పనులను పరిశీలించారు. ఆయన వెంట వివిధ శాఖల అధికారులు ఉన్నారు.