జీఎస్టీ తగ్గిస్తున్నారా ? లేదా ? కంపెనీలపై నజర్..పరిశ్రమలతో కేంద్రం సంప్రదింపులు ప్రారంభం

జీఎస్టీ తగ్గిస్తున్నారా ? లేదా ?  కంపెనీలపై నజర్..పరిశ్రమలతో కేంద్రం సంప్రదింపులు ప్రారంభం

న్యూఢిల్లీ:  జీఎస్టీ ప్రయోజనాలను వినియోగదారులకు కేంద్ర చేరవేయడానికి కఠిన చర్యలు తీసుకుంటోంది.  దీని కోసం కేంద్ర ఒక ప్రచారాన్ని కూడా నిర్వహిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్​ చౌదరి చెప్పారు. పన్నుల అధికారులు వస్తువులు, సేవల ప్రస్తుత ధరలను సేకరిస్తున్నారని, కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చిన తర్వాత వాటిని పోల్చి చూస్తారని సీనియర్ అధికారులు చెప్పారు. 

రేట్లలో మార్పులు చేసేందుకు కొన్ని రోజులు పట్టవచ్చని, ప్రభుత్వం మాత్రం నిశితంగా పర్యవేక్షిస్తుందని తెలిపారు. రేట్ల తగ్గింపు వల్ల వచ్చే లాభాలను కంపెనీలు తమ దగ్గరే ఉంచుకోకుండా చూస్తామన్నారు. వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్​ గోయల్​ మాట్లాడుతూ, జీఎస్టీ ప్రయోజనాలను వినియోగదారులకు అందించాలని పరిశ్రమలను కోరానని, ఇందుకు అవి కట్టుబడి ఉన్నాయని తెలిపారు.

 జీఎస్టీ తగ్గింపు వల్ల పొదుపు అయ్యే ప్రతి రూపాయిని వినియోగదారులకు చేరవేయాలని తాను కంపెనీలను కోరానని చెప్పారు. తక్కువ ధరలతో డిమాండ్ పెరుగుతుందని, దాని వల్ల వృద్ధి, ఉద్యోగాలు లభిస్తాయని గోయల్ అన్నారు. పరిశ్రమల నుంచి హామీలు లభించాయని, ప్రజల అంచనాలను అవి అందుకుంటాయని తాను నమ్ముతున్నట్లు గోయల్ చెప్పారు. 

ప్రభుత్వానికి రూ. 3,700 కోట్ల నష్టం

 జీఎస్టీ రేట్ల తగ్గింపు వల్ల ప్రభుత్వానికి కేవలం రూ. 3,700 కోట్ల ఆదాయ నష్టం మాత్రమే ఉంటుందని ఎస్​బీఐ రీసెర్చ్​ రిపోర్ట్​ వెల్లడించింది. దీని ప్రకారం.. జీఎస్టీ సంస్కరణల వల్ల వినియోగం పెరుగుతుంది. దీని వల్ల ఆర్థిక లోటుపై ఎలాంటి ప్రభావం ఉండదు.  

నిత్యావసర వస్తువులపై పన్ను 12 శాతం నుంచి 5 శాతానికి లేదా సున్నాకు తగ్గింది. దీని వల్ల సీపీఐ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25–--30 బేసిస్​ పాయింట్లు తగ్గుతుంది. 2026-–27 నాటికి మొత్తం సీపీఐ ద్రవ్యోల్బణం 65--–75 బేసిస్​ పాయింట్లు తగ్గుతుందని రిపోర్ట్​ అంచనా వేసింది. ఇదిలా ఉంటే,  ఆటోమొబైల్స్​పై జీఎస్టీ రేట్లు తగ్గించడం వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో టూవీలర్ల అమ్మకాలు 5-6 శాతం, ప్యాసింజర్​ వెహికల్స్​ అమ్మకాలు 2-3 శాతం పెరుగుతాయని క్రిసిల్​ రేటింగ్స్​ తెలిపింది.  తమ కార్ల  ధరలు రూ.1.45 లక్షల వరకు తగ్గుతాయని​ టాటా మోటార్స్​ 
ప్రకటించింది. 

కంపెనీల స్ట్రాటజీలు ఇలా.. 

ఎఫ్​ఎంసీజీ (బిస్కెట్లు, స్నాక్స్​, సబ్బులు, షాంపూలు)   రూ. 5, రూ. 10 ప్యాకెట్ల ధరలను తగ్గించడానికి బదులు, వాటి బరువును పెంచే (గ్రామేజ్​) అవకాశం ఉంది. ఇతర వస్తువులపై కొత్త ధరల స్టిక్కర్లు అతికిస్తారు. తయారీదారులు, పంపిణీదారులు, చిల్లర వ్యాపారుల మధ్య ధరల తేడాలను క్రెడిట్​ నోట్స్​తో సరిచేస్తారు.

కన్స్యూమర్​ డ్యూరబుల్స్​ (టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్​ మెషీన్లు)  వీటిపై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గింది. పండుగల సమయంలో గిరాకీ పెరుగుతుందని కంపెనీలు ఆశిస్తున్నాయి. కొన్ని సంస్థలు పాత, ఎక్కువ రేట్లపై బిల్లు చేసిన అమ్ముడుపోని స్టాక్​కు డీలర్లకు నష్టపరిహారం చెల్లిస్తాయి. ఉదాహరణకు, రూ. 20 వేల విలువైన ఏసీకి గతంలో 28 శాతం జీఎస్టీతో కలిపి రూ. 5,600 పన్ను పడేది. ఇప్పుడు అది 18 శాతానికి తగ్గి రూ. 3,600 అవుతుంది. దీంతో రూ. 2,000 ఆదా అవుతుంది.

హోటళ్లు :  రూ. 7,500 లోపు గదులపై పన్ను 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గింది.  చెక్-ఇన్​ వద్ద చెల్లించే అతిథులకు తక్కువ రేట్ల వల్ల ప్రయోజనం లభిస్తుంది. సెప్టెంబర్​ 22 తర్వాత బస ఉన్నప్పటికీ, ముందుగా చెల్లింపులు చేస్తే పాత పన్ను రేట్లే వర్తిస్తాయి.

విమాన ప్రయాణం: ప్రీమియం ఎకానమీ, బిజినెస్​, ఫస్ట్​ క్లాస్​లపై జీఎస్టీ 12 శాతం నుంచి 18 శాతానికి పెరిగింది. సెప్టెంబర్​ 22కు ముందు బుక్​ చేసిన టికెట్లపై పాత రేట్లే వర్తిస్తాయి. కొత్త బుకింగ్​లపై ఎక్కువ పన్ను వర్తిస్తుంది. ఉదాహరణకు, రూ. 50,000 విలువైన బిజినెస్​-క్లాస్​ టికెట్​కు గతంలో రూ. 6,000 జీఎస్టీ పడేది. సెప్టెంబర్​ 22 తర్వాత అది రూ. 9,000కి పెరుగుతుంది.

బీమా :  హెల్త్​ ,  లైఫ్​ ఇన్సూరెన్స్​లకు జీఎస్టీ నుంచి మినహాయింపు లభించింది. దీంతో వినియోగదారులకు 18 శాతం ఆదా అవుతుంది.  ఇన్సూరెన్స్​ కంపెనీలు ఇన్​పుట్​ టాక్స్​ క్రెడిట్​ను కోల్పోవడంపై ఆందోళన చెందుతున్నాయి. ప్రీమియంలను తగ్గించడానికి బదులు, రూమ్​ అప్​గ్రేడ్​ వంటి విలువ-అదనపు సేవలను అందించవచ్చు.  

కార్​ డీలర్లు :  కొత్త సెస్  వల్ల కార్లపై మొత్తం పన్ను తగ్గింది. పాత పన్ను రేట్లపై కొనుగోలు చేసిన అమ్ముడుపోని వాహనాలపై డీలర్లకు భారీ నష్టాలు ఎదురయ్యాయి. ఎందుకంటే ఇప్పటికే చెల్లించిన సెస్​ను తిరిగి పొందలేరు. గతంలో 50 శాతం (28 శాతం జీఎస్టీ + 22 శాతం సెస్​) పన్ను ఉన్న కారుపై ఇప్పుడు 40 శాతం పన్ను ఉంటుంది. కొన్ని తయారీ కంపెనీలు పాక్షిక ఉపశమనం అందిస్తున్నాయి. అయితే చాలా మంది డీలర్లకు నష్టాలు తప్పవు.