- మకర ద్వారం ఎదుట కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన
- పాల్గొన్న మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: ఉభయ సభల్లో లేబర్ కోడ్‌కు వ్యతిరేకంగా అపోజిషన్ పార్టీల నేతలు నిరసన తెలిపారు. కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా లేబర్ కోడ్ చట్టాలు తీసుకొచ్చారని మండిపడ్డారు. వెంటనే లేబర్ కోడ్‌ను ఉపసంహరించుకోవాలంటూ పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని నిరసన తెలిపారు.
ఈ ఆందోళన కార్యక్రమంలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఆ పార్టీ ఎంపీలు, డీఎంకే, టీఎంసీ, లెఫ్ట్ పార్టీల నేతలు పాల్గొన్నారు. మకర్ ద్వార్ ఎదుట నిలబడి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్పొరేట్ కంపెనీలకు కేంద్రం వత్తాసు పలుకుతున్నదని ఖర్గే మండిపడ్డారు.
కొత్త లేబర్ కోడ్ చట్టంతో కార్మికులకు జాబ్ సెక్యూరిటీ ఉండదన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్‌లను తీసుకురావడం కార్మికులకు ద్రోహం చేయడమేనని విమర్శించారు. కార్మికులను కట్టు బానిసలుగా మార్చేలా లేబర్ కోడ్ చట్టాలు ఉన్నాయని మండిపడ్డారు. 8 గంటల పని నిబంధన కాగితానికే పరిమితమైందని తెలిపారు.
వర్కింగ్ అవర్స్‌ను 10 నుంచి 13 గంటలకు పెంచేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నదన్నారు. కార్మికుల సమ్మె హక్కును పరిమితం చేయడం, గ్రాట్యుటీ, బోనస్, హెచ్‌ఆర్‌ఏ వంటి సౌకర్యాలకు తూట్లు పొడవాలని చూస్తున్నదని మండిపడ్డారు. శ్రమ దోపిడీకి ఎన్డీయే కొత్త దారులు
తెరిచిందని ప్రియాంక గాంధీ విమర్శించారు.
మాస్క్‌లు ధరించి నిరసన
ఢిల్లీలో పెరిగిపోతున్న వాయు కాలుష్యంపై అపోజిషన్ పార్టీల ఎంపీల వినూత్నంగా నిరసన తెలిపారు. ఆక్సిజన్ మాస్కులు ధరించి సభకు హాజరయ్యారు. ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్‌పై చర్చించాలని ఎంపీ దీపేందర్ హుడా స్పీకర్‌కు వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. ఢిల్లీలో గాలికాలుష్యం పెరిగిందని, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిపడుతున్నట్లు సభ్యులు తెలిపారు. కాగా, లోక్‌సభలో మూడో రోజైన బుధవారం కూడా వాయిదాల పర్వం కొనసాగింది.
ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్, కొత్త లేబర్ కోడ్ చట్టాలు, ఢిల్లీ పేలుళ్లతో పాటు సర్‌పై చర్చించాలంటూ ప్రతిపక్షాలు నిరసన తెలియజేశాయి. తాము చర్చకు ప్రతిపాదించిన అంశాలపై మొదట చర్చ జరగాలని కోరుతూ స్పీకర్ పోడియం వద్దకు చేరుకొని నినాదాలు చేశారు.
స్పీకర్ ఓం బిర్లా.. ప్రతిపక్ష సభ్యులను శాంతింపజేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో ఆయన సభను వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశమైన తర్వాత కూడా నిరసనలు కొనసాగినప్పటికీ, ప్రభుత్వం తరఫున కేంద్ర ఎక్సైజ్ (సవరణ) బిల్లు, 2025పై చర్చ జరిగింది.
రాజ్యసభలోనూ ప్రతిపక్షాల నిరసనలు
రాజ్యసభలోనూ ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి. సర్ ప్రక్రియపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ పలుమార్లు సభను వాయిదా వేశారు. ఆందోళనల మధ్యే, జల (కాలుష్య నివారణ, నియంత్రణ) సవరణ బిల్లు, 2024 పై చర్చ కొనసాగింది. రాజ్‌భవన్ ను లోక్‌భవన్‌గా పేరు మార్చడాన్ని ఏఐటీసీ సభ్యుడు డోలా సేన్ వ్యతిరేకించారు.
