పవర్ ఎక్స్ఛేంజ్‌‌పై సీఎం కేసీఆర్ సమీక్ష

పవర్ ఎక్స్ఛేంజ్‌‌పై సీఎం కేసీఆర్ సమీక్ష

నోటీస్ ఇవ్వకుండా పవర్ పర్చేస్ జరపకుండా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం కరెక్టు కాదని.. బకాయిలు చెల్లింపు చేసినప్పటికీ ఇలా చేయడం దారుణమని ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు వ్యాఖ్యానించారు. రూ. 1, 360 కోట్లు కట్టినా ఇలా చేయడం చాలా బాధాకరమన్నారు. హైకోర్టు స్టే ఉందని.. ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో అంతరాయం వస్తే తమకు సహకరించాలని రైతులు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా విద్యుత్ క్రయ, విక్రయాలు జరిగే ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజీ (IEX) నుంచి లావాదేవీలు జరుపకుండా రాష్ట్రాలపై కేంద్రం నిషేధం విధించింది. తెలంగాణ, ఏపీలతో పాటు 13 రాష్ట్రాలకు చెందిన 29 విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు ఈ నిషేధం వర్తిస్తుందని ప్రకటించింది. ఈ క్రమంలో... పవర్ ఎక్స్చేంజీపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు విద్యుత్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దీనిపై  ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ...

కేంద్ర ప్రభుత్వం నోటీస్ తో 20 మిలియన్ యూనిట్స్ ఇవాళ డ్రా చేయలేకుండా పోయామన్నారు. ప్రజలకు, వినియోగదారులకు సాధ్యమైనంత వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని సీఎం కేసీఆర్ సూచించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా అయ్యే విధంగా చేయడం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో వర్షాలు బాగా పడడంతో జల విద్యుత్ ను పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేస్తున్నట్లు, థర్మల్, హైడల్, సోలార్ పవర్ ఉత్పత్తి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఇవాళ 12214 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చినా ఎక్కడ కూడా సరఫరాకు అంతరాయం రాకుండా చేశామని చెప్పుకొచ్చారు. ఉదయం, సాయంత్రం ఎక్కువగా  రైతులు పంపు సెట్లు ఆన్ చేస్తారని.. ఆ సమయంలో కొంత ఎక్కువ డిమాండ్ వస్తుందన్నారు. త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పటి వరకు రైతన్నలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.