మే 13న వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి : వికాస్​ రాజ్

మే 13న వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి : వికాస్​ రాజ్
  • ప్రైవేట్ ​కంపెనీలకు సీఈఓ వికాస్​ రాజ్ ఆదేశాలు
  • 13 అసెంబ్లీ సెగ్మెంట్లు మినహా.. రాష్ట్రమంతా సాయంత్రం 6 దాకా పోలింగ్ 
  • రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ 
  • ఎలక్ట్రానిక్, సోషల్​ మీడియాలో నో యాడ్స్, నో స్పీచెస్
  • నేడు, రేపు వైన్స్​ బంద్​

హైదరాబాద్, వెలుగు : ఈ నెల13న (సోమవారం) లోక్​సభ ఎన్నికల పోలింగ్​సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్​కంపెనీలు ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్​ రాజ్​సూచించారు. ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశామని.. నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. శనివారం బీఆర్​కే భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్​మొదలై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుందని తెలిపారు.

13 మావోయిస్టు ప్రభావిత అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే ఓటింగ్​ క్లోజ్​అవుతుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రచార సమయం ముగిసిందని, పోలింగ్​ పూర్తయ్యే వరకు 144 సెక్షన్​అమల్లో ఉంటుందని సీఈఓ పేర్కొన్నారు. నలుగురి కంటే ఎక్కువ మంది తిరుగొద్దన్నారు. బల్క్ ఎస్​ఎంఎస్​లు, ఎంఎంఎస్​లు సర్య్కులేట్​ చేయడానికి వీలు లేదన్నారు. పోలింగ్ ముగిసే వరకు 48 గంటల పాటు వచ్చే ఫిర్యాదులపై 100 నిమిషాల్లోనే చర్యలు ఉంటాయని ఆయన అన్నారు. సోమవారం తెలంగాణలో పోలింగ్​ ముగిసినా..

జూన్‌‌‌‌ 1వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్‌‌‌‌ పోల్స్‌‌‌‌పై నిషేధం ఉందని తెలిపారు. ప్రచార సమయం ముగిసినందున నిఘా మరింత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇతర నియోజకవర్గాల వారు ఉండకూడదని తెలిపారు. కల్యాణ మండపాలు, కమ్యూనిటీ హాల్స్, హోటల్స్ లో ఉన్న ఇతర నియోజకవర్గాల వ్యక్తులు వెళ్లిపోవాల్సిందేనన్నారు. సోమవారం(13న) దినపత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలంటే పార్టీలు

క్యాండిడేట్లు అనుమతి తీసుకోవాలని ఆయన సూచించారు. ఎలక్ట్రానిక్‌‌‌‌ మీడియా, వెబ్‌‌‌‌సైట్లలో రాజకీయ ప్రకటనలు ఇవ్వకూడదని తెలిపారు.  అలాగే, ఆదివారంతో పాటు సోమవారం సాయంత్రం  6 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులు మూసి ఉంటాయని తెలిపారు. 

35,809 పోలింగ్​ కేంద్రాలు

రాష్ట్రంలో 17 లోక్‌‌‌‌సభ స్థానాల్లో 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని సీఈఓ తెలిపారు. ఇందులో 51 మంది మహిళా అభ్యర్థులు పోటీలో ఉన్నారని తెలిపారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా  35,809 పోలింగ్​ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 2 వేల పోలింగ్ స్టేషన్లపై ప్రత్యేక నిఘా ఉంటుందని చెప్పారు.  సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు 232 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈవీఎంలు తరలించే వాహనాలకు జీపీఎస్​ ఉంటుందని, సీఈఓ ఆఫీస్ మానిటరింగ్ చేస్తుందన్నారు.  రాష్ట్రంలో అతి తక్కువ ఓటర్లు ఉన్న పోలింగ్​ కేంద్రాలు మూడు ఉన్నాయని వెల్లడించారు.

ఇందులో వరుసగా 10, 12, 14 మంది చొప్పున ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. 25 మంది ఓటర్ల కంటే తక్కువ ఉన్న పోలింగ్ ​స్టేషన్లు రాష్ట్రంలో 11 ఉన్నాయని, 50 మంది ఓటర్ల కంటే తక్కువగా ఉన్నవి 22, 100 మంది ఓటర్ల కంటే తక్కువ ఉన్న పోలింగ్​ కేంద్రాలు 54 ఉన్నట్టు తెలిపారు. గతంలో తక్కువ పోలింగ్​ నమోదైన 5 వేల పోలింగ్​ కేంద్రాలను గుర్తించి.. అనలాసిస్​ చేసి ఈసారి ఓటింగ్​ పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

పోలింగ్‌‌‌‌ కోసం 1.09  లక్షల బ్యాలెట్‌‌‌‌ యూనిట్లు వినియోగిస్తున్నామని తెలిపారు. ఇందులో 44,906 కంట్రోల్ ​యూనిట్లు, 50,135 వీవీప్యాట్​ మిషన్లు ఉంటాయని వెల్లడించారు.  ఒక్క ఆదిలాబాద్ తప్ప ప్రతీ పార్లమెంట్ సెగ్మెంట్​లో రెండేసి బ్యాలెట్ యూనిట్లు ఉంటాయని వికాస్​రాజ్​ తెలిపారు.  

విధుల్లో 2.94 లక్షల మంది ఉద్యోగులు 

ఈ లోక్​సభ ఎన్నికల పోలింగ్​ కోసం మొత్తం 2.94 లక్షల మంది ఉద్యోగులు వివిధ రకాల విధుల్లో ఉంటారని సీఈఓ వివరించారు. ఇందులో పోలింగ్​విధుల్లో నేరుగా 1.96 లక్షల మంది పాల్గొంటారన్నారు. సెక్టార్, రూట్ ఆఫీసర్లు 3,522 మంది ఉన్నారన్నారు. ఎన్నికల బందోబస్తు కోసం కేంద్ర బలగాలతో పాటు ఇతర రాష్ట్రాల పోలీసులు 72  వేల  మంది

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సిబ్బంది 24 వేల మంది బందోబస్తులో ఉంటారని చెప్పారు. తనిఖీల్లో ఇప్పటివరకు రూ.320 కోట్ల విలువైన సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దానికి సంబంధించి 8 వేల కేసులు, డ్రగ్స్​ సరఫరాకు సంబంధించి 200లకు పైగా కేసులు నమోదు చేసినట్లు వివరించారు.  

1.88 లక్షల పోస్టల్ ​బ్యాలెట్​ ఓట్లు

రాష్ట్రంలో 1.88 లక్షల మంది ఉద్యోగులు పోస్టల్‌‌‌‌ బ్యాలెట్ వినియోగించుకున్నారని సీఈఓ తెలిపారు. 20,163 మంది హోమ్‌‌‌‌ ఓటు వినియోగించుకున్నారని వివరించారు.  హోమ్​ ఓటింగ్ అప్లై చేసుకున్న వారిలో 93% మంది ఓట్లు వేశారని చెప్పారు. 3.21 కోట్ల ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తయిందని తెలిపారు.