ఎల్బీ నగర్ (హైదరాబాద్), వెలుగు:
పోలీసులున్నది ముగ్గురు.. చెడ్డీ గ్యాంగ్‌లో దానికి డబుల్. ఖాకీల దగ్గర కేవలం లాఠీలు.. దొంగల ముఠాల చేతుల్లో కర్రలు, రాడ్లు. ఫలితం కళ్లముందే దొంగలున్నా పట్టుకోలేని పరిస్థితి. పరారవుతున్నా ఏమీ చేయలేని దుస్థితి. గురువారం హైదరాబాద్ హయత్‌నగర్ పరిధిలోని కుంట్లూర్ శివార్లలో ఉన్న జూబ్లీ కాలనీలో చెడ్డీ గ్యాంగ్ చేసిన దోపిడీ ఉదంతంలో కనిపించిన సీన్ ఇది. నెల రోజుల గ్యాప్‌లోనే మరో రెండు ఇళ్లలో దోపిడీకి పాల్పడింది చెడ్డీ గ్యాంగ్. పోలీసులకు బాధితులు ఫోన్ చేసినా కనీసం ఎత్తలేదు. గంటన్నరకు గానీ అక్కడకు చేరుకోలేదు. వచ్చినా కళ్లముందే పారిపోతున్న ముఠాను పట్టుకోలేకపోయారు. 75 వేల నగదు, 20 తులాల బంగారంతో చెడ్డీ గ్యాంగ్ ఉడాయించింది. అర్ధరాత్రి 12 గంటల టైంలో సప్పిడి వెంకట్‌రెడ్డి అనే వ్యక్తి ఇంటి తలుపులను కర్రలు, రాడ్లతో వచ్చిన ఆరుగురు సభ్యుల చెడ్డీ గ్యాంగ్ పగులగొట్టింది. వెంకట్‌రెడ్డి కుటుంబ సభ్యులు తేరుకునేలోపే గ్యాంగ్ ఇంట్లోకి చొరబడింది. వెంకట్‌రెడ్డిని మంచంపైనే పడుకోబెట్టి దుప్పటి కప్పేసింది. దుప్పటి తీస్తే చంపేస్తామంటూ ఓ వ్యక్తి రాడ్ పట్టుకుని అక్కడే నిలబడ్డాడు. ఎవరైనా వస్తే అలర్ట్ చేసేందుకు ఇంకో దొంగ బయట నిలబడ్డాడు. మిగతా నలుగురు దుండగులు ఇంట్లోని డబ్బులు, బంగారు ఆభరణాలను కాజేశారు. వృద్ధురాలి చెవికి ఉన్న దిద్దులను లాగడంతో ఆమెకు గాయాలయ్యాయి. 12.22 గంటలకు వెంకట్‌రెడ్డి కూతురు సింధు, పోలీస్ పెట్రోలింగ్ అధికారులకు ఫోన్ చేసినా, వాళ్లు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆమె 100కు ఫోన్ చేసి సమాచారమిచ్చింది. అయినా పోలీసులు సమయానికి ఘటనా స్థలానికి చేరుకోలేదు. 40 నిమిషాల పాటు చెడ్డీ గ్యాంగ్, వెంకట్‌రెడ్డి ఇంట్లోనే ఉన్నా రాలేదు. ఆ తర్వాత 2 గంటల ప్రాంతంలో వెంకట్‌రెడ్డి ఇంటికి ఎదురుగా ఉన్న ఐతరాజు శ్రీనివాస్ అనే ఆర్ఎంపీ ఇంట్లోకీ ప్రవేశించారు. వెంకట్‌రెడ్డి ఇంట్లో చేసినట్టుగానే దోపిడీ చేశారు. ఆ టైంలో పోలీసులు వచ్చారు. అయితే, బయట ఉన్న మరో దొంగ ఆ విషయాన్ని చెప్పడంతో అలర్ట్ అయిన ముఠా అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేసింది. పారిపోతూనే ఓ దుండగుడు శ్రీనివాస్ భార్య మెడలోని పుస్తెల తాడు, చెవి దుద్దులు లాక్కొని పరారయ్యాడు.
ఇంటర్‌సెప్టర్‌ను ఎందుకు అలర్ట్ చేయలేదు?
హైవేలతో పాటు శివారు ప్రాంతాల్లో పెట్రోలింగ్ కోసం ఇంటర్‌సెప్టర్ వాహనాలను ఏర్పాటు చేస్తారు. వారి దగ్గర గన్నులుంటాయి. చోరీ జరిగిన టైంలో ఇంటర్సెప్టర్టీంను అలర్ట్ చేసి ఉంటే దొంగలు దొరికేవారని స్థానికులు చెబుతున్నారు. గ్యాంగ్ తిరగబడుతుందన్న భయం లేకుండా వాళ్లను పట్టుకోవడానికి ప్రయత్నించే వాళ్లంటున్నారు. ఒకవేళ ఇంటర్‌సెప్టర్ టీంను పంపకుంటే, కనీసం ఎస్సై స్థాయి అధికారినైనా పంపి ఉంటే, ఆయన దగ్గరా గన్ ఉంటుంది కాబట్టి, దొంగలు దొరికిపోయేవారేమోనని అంటున్నారు. ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారు. కాగా, ఎల్బీనగర్ డీసీపీ సంప్రీత్ సింగ్, ఏసీపీ జయరాంలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.

