- 20 రోజుల క్రితం పనిలో చేరిన నేపాలీ జంట
- యజమాని ఊరెళ్లిన సమయంలో చోరీ
- యూపీలో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు?
హైదరాబాద్ గచ్చిబౌలిలో మరో నేపాలీ గ్యాంగ్ భారీ చోరీకి పాల్పడింది. పనిచేస్తున్న ఇంట్లోని లాకర్ తెరిచి, అందులో ఉన్న దాదాపు రూ.5 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలను దోచుకుపోయారు.
గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్సిటీలోని గచ్చిబౌలిలో మరో నేపాలీ గ్యాంగ్ భారీ చోరీకి పాల్పడింది. పనిచేస్తున్న ఇంట్లోని లాకర్ ను తెరిచి, అందులో ఉన్న దాదాపు రూ.5 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలను దోచుకుపోయారు. 20 రోజుల క్రితం పనిలో చేరిన నేపాలీ జంట ఈ చోరీకి పాల్పడినట్టు తెలిసింది. గచ్చిబౌలి హిల్ రిడ్జ్ కమ్యూనిటీలోని విల్లా నెంబరు 73లో వ్యాపారవేత్త ప్రకాశ్ పాయ్(73) తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు.
ఢిల్లీలో ఉన్న తన బంధువుల ఇంట్లో వేడుక కోసం భార్య వందన, కుమారుడు అభిజిత్ తో కలిసి ఈ నెల 6న సాయంత్రం బయలుదేరి వెళ్లారు. 7న సాయంత్రం తిరిగి వచ్చి చూడగా బాల్కానీకి చెందిన గ్లాస్ పగులగొట్టి ఉంది. దీంతో లోపలికి వెళ్లి చూడగా.. లాకర్ పైన వినాయకుడి పటానికి ఉన్న 4తులాల బంగారు గొలుసు కనిపించలేదు.
ఇంట్లోని సర్వెంట్ గదిలో ఉండాల్సిన నేపాలీ భార్య, భర్త సైతం కనిపించకుండా పోయారు. దీంతో ప్రకాశ్ పాయ్ వెంటనే గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఓ వైపు నేపాలీ జంట కోసం గాలింపు చేపడుతుండగా.. 8వ తేదీన ప్రకాశ్ పాయ్ ఇంట్లో ఉన్న లాకర్ ను తెరిచి చూడగా, అందులో ఉండాల్సిన బంగారు, వజ్రాల ఆభరణాలు కనిపించలేదు. దీంతో మరోసారి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.
- కొంప ముంచిన చెంబులో 'కీ'..
ప్రకాశ్ పాయ్ 20 రోజుల క్రితం నేపాలీ కి చెందిన విమలా షాహీ, కమల్ షాహీ అనే భార్య, భర్తలను పనిలో పెట్టుకున్నాడు. వీరు ఇంటి పనులు చేస్తూ సర్వెంట్ గదిలో ఉంటున్నారు. ప్రకాశ్ పాయ్ విల్లాలో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న గదిలో రెండు లాకర్లు ఉన్నాయి. వాటి తాళం చెవిని ఆయన ఎప్పుడూ లాకర్ పైన ఉన్న చెంబులో పెట్టడం అలవాటు.
జూన్ 6న ఢిల్లీ వెళ్లిన సమయంలోనూ తాళం చెవిని చెంబులో పెట్టి, ఇంటికి తాళం వేసి వెళ్లాడు. కాగా, యజమాని ఢిల్లీకి వెళ్లడంతో కమల్ షాహీ తన భార్యతో పాటు మరో వ్యక్తితో కలిసి చోరీకి పథకం వేశాడు. 6వ తేదీ రాత్రి ఇంటి బాల్కనికి ఉన్న గ్లాస్ ను పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు.
అనంతరం లాకర్ పైన వినాయకుడి చిత్రపటానికి ఉన్న బంగారు గొలుసును చోరీ చేశాడు. అలాగే, చెంబులో ఉన్న తాళం చెవి తీసుకొని లాకర్ తెరిచి, అందులో ఉన్న దాదాపు 5 కోట్ల విలువైన 5కిలోల బంగారు, వజ్రాల ఆభరణాలను దొంగలించారు. అనంతరం త్రిపుల్ ఐటీ జంక్షన్ వరకు నడుచుకుంటూ వచ్చి.. అక్కడి నుంచి ఆటోలో సికింద్రాబాద్ కు వెళ్లారు. అక్కడ ట్రైన్ ఎక్కి నగరం నుంచి పరారైనట్టు పోలీసులు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. విల్లా యజమాని నిర్లక్ష్యం కారణంగా పగులగొట్టేందుకు వీలులేని భారీ లాకర్ ఉన్నా.. తాళం చెవి అక్కడే ఉన్న చెంబులో పెట్టడం దొంగలకు వరంగా మారింది.
- యూపీలో చిక్కిన నిందితులు?
చోరీ అనంతరం నేపాలీ జంట కోసం గచ్చిబౌలి పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. హిల్ రిడ్జ్ విల్లా నుంచి సీసీ కెమెరాలను పరిశీలించి.. ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో గాలింపు చేపట్టారు. నిందితులు దేశం దాటి నేపాల్‌కు వెళ్లకుండా ముందు జాగ్రత్తగా సరిహద్దు రాష్ట్రాలపై దృష్టి పెట్టారు. అయితే, యూపీలో నేపాలీ జంటను సైబరాబాద్ ప్రత్యేక బృందాలు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈమేరకు చోరీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకొని నిందితులను నగరానికి తరలిస్తున్నట్టు సమాచారం.
