ఒక మహిళా ప్రొఫెసర్ ను హత్య చేసేందుకు ఏకంగా 14 వందల కిలోమీటర్లు ప్రయాణించారు హంతకులు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా వెళ్లి.. అరగంటలో హత్య చేసి చేతులు దులుపుకుని వెళ్లిపోయారు. ఢిల్లీ ప్రొఫెసర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు ఈ కేసులో షాకింగ్ విషయాలు వెల్లడించారు.
వెస్ట్ బెంగాల్ కు చెందిన మహిళా ప్రొఫెసర్ ఢిల్లీలోని ఓ అపార్టుమెంట్లో జూన్ 03 (బుధవారం) మర్డర్ కు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎట్టకేలకు హంతకులను పట్టుకున్నారు. భార్య భర్తలు తమ కొడుకుతో కలిసి ప్రొఫెసర్ ను చంపేసినట్లు పోలీసులు వెల్లడించారు.
దేవోస్మిత పాల్ అనే పశ్చిమ బెంగాల్ కు చెందిన మహిళ.. ఢిల్లీలో శివాజీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. బుధవారం ఈస్ట్ ఢిల్లీలోని వసుధర ఎంక్లేవ్ లో తన ఫ్లాట్ లో హత్యకు గురయ్యారు. ఈ కేసుకు సంబంధించి బెంగాల్ వర్ధమాన్ లో రాంప్రసాద్ దాస్, బన్ శ్రీ దాస్ లను అరెస్టు చేశారు. వీరితో పాటు వారి మైనర్ బాలుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. వివాహిత అయిన ప్రొఫెసర్ దేవోస్మిత పాల్ 2002లో డైవర్స్ తీసుకుని ఢిల్లీలో ఒంటరిగా ఉంటున్నారు. ఆమె మాజీ భర్త బెంగాల్ లోనే ఉంటున్నాడు.
హంతకులు జూన్ 03న మాస్కులు తొడిగి అపార్టుమెంటులోకి ప్రవేశించినట్లు సీసీటీవీలో రికార్డయ్యింది. ప్రైవేట్ క్యాబ్ లో బ్యాగులతో వచ్చిన ఫ్యామిలీ.. 6వ ఫ్లోర్ కు లిఫ్టులో వెళ్లకుండా మెట్లద్వారా వెళ్లారు. ఈ దంపతులు తోడుగా తమ మైనర్ అయిన కొడుకును తీసుకొచ్చారు. ఇద్దరే అయితే అనుమానం వస్తుందని.. మైనర్ బాలుడు ఉంటే ఫ్యామిలీ అని ఎవరూ పట్టించుకోరనే ఉద్దేశం.
ప్రొఫెసర్ ఇంటి డోర్ తట్టిన ఫ్యామిలీ.. కుశల ప్రశ్నలతో ఇంట్లోకి వెళ్లారు. ప్రొఫెసర్ కూడా సాదర ఆహ్వానం పలికింది. ఆ తర్వాత బ్యాగుల్లో తెచ్చిన ఆయుధాలతో ప్రొఫెసర్ ను చంపేసి.. అరగంటలో అంతా క్లీన్ చేసుకుని.. బట్టలు మార్చుకుని ప్రశాంతంగా వెళ్లిపోయారు. ముందుగానే మాట్లాడుకున్న క్యాబ్ అక్కడే వేచి ఉండగా.. అందులో ఎవరికీ అనుమానం రాకుండా వెళ్లిపోయారు.
- ఇలా దొరికారు..
ఢిల్లీలో సంచలనంగా మారిన ఈ కేసులో పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా ముందుంగా క్యాబ్ డ్రైవర్ ను పట్టుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారంతో.. ఆపార్టుమెంటుకు వచ్చి పోయిన వాళ్లలో కనీసం 200 మందిని అనుమానితులుగా చేర్చి.. అందులో 13 మందిని షార్ట్ లిస్టు చేశారు. ఏడు పోలీసు బృందాలు 4 రాష్ట్రాలలో పర్యటించి.. వందలాది మందిని విచారించారు. ఆ విధంగా.. చివరికి వర్ధమాన్ లో హంతకులను పట్టుకున్నారు.
- హత్యకు కారణం ఇదే:
ప్రొఫెసర్ కు బెంగాల్ లో ఇల్లు, ఆస్తి ఉంది. ఆమె అమ్మ తరఫున వచ్చిన ఆస్తి అది. ఆమె తాత చనిపోవడంతో ఆస్తి ప్రొఫెసర్ కు సంక్రమించింది. ప్రొఫెసర్ ఢిల్లీలో నివసిస్తుండటంతో.. కోట్ల విలువ చేసే ఆ ఇంట్లో కిరాయికి ఉంటున్న కుటుంబం.. ఆమెను చంపేసి ఆస్తి కాజేయాలని ప్లాన్ చేసింది. వాళ్ల ప్రవర్తనను గమనించిన ప్రొఫెసర్ ఇల్లు ఖాళీ చేయాల్సిందిగా చెప్పింది. దీంతో హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
