హైదరాబాద్ మల్కాజ్ గిరి బుధవారం (జూన్ 10) తుపాకి చప్పుళ్లతో తెల్లవారింది. భార్యా భర్తల మధ్య గొడవ కాల్పుల వరకు వెళ్లింది. మాట్లాడుకుందాం అని పిలిచిన భర్త.. కాల్పులు జరపటంతో భార్య స్పాట్ లోనే రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు వదిలింది. మహిళ హత్య ఘటన మల్కాజ్ గిరిలో కలకలం రేపింది.
స్థానికుల వివరాల ప్రకారం.. మల్కాజ్ గిరిలోని మారుతీ నగర్ లో జరిగింది ఈ ఘటన. అరుణ్, నిషారాణి దంతపులు గొడవల కారణంగా వేర్వేరుగా ఉంటున్నారు. మాట్లాడుకుందాం రమ్మని భర్త అరుణ్ భార్య నిషారాణిని పిలిపించాడు. భార్య రాగానే వెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్చేశాడు. దీంతో ఉషారాణి స్పాట్ లోనే చనిపోయింది.
ఈ హత్యలో అరుణ్ కు మరో వ్యక్తి సహకరించినట్లు స్థానికులు తెలిపారు. గతంలో అంబర్ పేట్ లో తుపాకీ తో హల్చల్ చేసిన అరుణ్.. లేటెస్టుగా తన భార్యను కాల్చి చంపడం చర్చనీయాంశాంగా మారింది. అనుమానంతోనే భార్యను చంపేసినట్లు స్థానికులు చెబుతున్నారు. గతంలోనే తుపాకీతో హల్ చేసిన అరుణ్ నుంచి పోలీసులు తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. మళ్లీ అతనికి తుపాకీ ఎలా వచ్చింది..? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
