సంగారెడ్డి జిల్లాలో ఆగమవుతున్న గొలుసుకట్టు చెరువులు

 సంగారెడ్డి జిల్లాలో ఆగమవుతున్న గొలుసుకట్టు చెరువులు
  • పట్టించుకోని అధికారులు.. ఆందోళనలో రైతులు

ఇటీవల కురుస్తున్న వర్షాలకు సంగారెడ్డి జిల్లాలో చెరువులు తెగుతున్నయ్.. ఇప్పటికే ఎనిమిది చెరువులు తెగి నీళ్లన్నీ వృథా అయ్యాయి. ఇంకా చాలా చెరువులు రిపేర్లకు నోచుకోక ఎప్పుడు తెగుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. గతంలో తెగిన కట్టలకు రిపేర్లు చేయకపోవడంతో క్రమంగా చిన్నతరహా చెరువులు కనుమరుగవుతున్నాయని స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు.  

సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లా గొలుసుకట్టు చెరువులకు పేరుగాంచింది. జిల్లాలో దాదాపు 211 పెద్ద, చిన్నతరహా చెరువులు ఉన్నాయి. సింగూరు ప్రాజెక్టు ప్రస్తుతం నిండు కుండలా మారినా పూర్తిస్థాయిలో భూములను తడపలేకపోతోంది. కనీసం చిన్న, పెద్ద తరహా చెరువులైన వాటి ఆయకట్టు భూములను పరిరక్షిస్తున్నాయా అంటే అవి కూడా పెద్దగా ఉపయోగంలోకి రావడం లేదు. చెరువుల రిపేర్లకు కేసీఆర్ ప్రభుత్వం ఫండ్స్  ఇవ్వడం లేదు. ప్రతిఏటా రిలీజ్​ అయ్యే కొద్దిపాటి నిధులు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో చెరువులు రిపేర్లకు నోచుకోక ఇప్పటికే ఎనిమిది చెరువుల కట్టలు తెగిపోయాయి. ఇందులో మల్కాపూర్, మల్లేపల్లి, కంది పెద్ద చెరువులతోపాటు పడిగోని కుంట, దేవుని చెరువు, పాత చెరువు, మొగిలికుంట, పోచమ్మ కుంట ఉన్నాయి.  

మల్కాపూర్ పెద్ద చెరువు విస్తీర్ణం దాదాపు 100 ఎకరాలు ఉంటుంది. దీని ఆయకట్టు కింద 3,600 ఎకరాలు ఉండగా, ఈ చెరువు 11 ఊర్లకు సాగు, తాగునీటి అవసరాలు తీరుస్తూ వచ్చింది. ప్రస్తుతం ఈ చెరువులో వరద నీరు ఉన్న కనీసం 500 ఎకరాలకు సాగు నీరు అందించలేకపోతోంది. కారణం చెరువుకు రిపేర్లు లేక అందులో ఉన్న నీరు వృథాగా పోతున్నాయి. అక్కడక్కడ చెరువు కట్ట తెగి బీటలువారాయి. ఈ చెరువును బాగు చేయాలని రైతులు కోరుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు.  ఈ చెరువుకు రిపేర్లు చేయకపోయినా చేసినట్టు గతంలో దాదాపు రూ. 20 లక్షల బిల్లులు తీసుకునట్టు ఆరోపణలున్నాయి. ఈ విషయమై చెరువుల పరిరక్షణ కమిటీ ప్రతినిధులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

కొండాపూర్ మండలం మల్లేపల్లి (చెర్ల గోపులారం) చెరువు 30 ఎకరాలలో విస్తరించి ఉంది. ఈ చెరువు కింద 190 ఎకరాల ఆయకట్టు ఉంటుంది. గతేడాది కురిసిన వానలకు చెరువు కట్ట తెగిపోగా ఈసారి వర్షాకాలం మొదట్లో అరకొర రిపేర్లు చేసి చేతులు దులిపేసుకున్నారు. దీంతో ప్రస్తుత వర్షాలకు చెరువు కట్ట 
తెగిపోయి చెరువులో ఉన్న నీరంతా బయటికి వెళ్లి పోయింది. ఈ కట్ట ప్రమాదస్థాయికి చేరి రాకపోకలకు ఇబ్బంది కాగా,  ప్రస్తుతం కట్టపై కంచె వేసి దారిని మూసేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కట్టలకు రిపేర్లు చేయలేని పరిస్థితి ఏర్పడింది. 

కనుమరుగవుతున్న గొలుసుకట్టు చెరువులు

సంగారెడ్డి, కంది, జిన్నారం మండలాల్లో 58 గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి. ఇందులో 26 పెద్ద చెరువులు, 32 చిన్న కుంటలు ఉండగా, ప్రస్తుతం వీటి బాగోగులు చూసుకునే వారు లేకుండా పోయారు. ప్రధానంగా కంది పెద్ద చెరువు, పడిగోని కుంట, దేవుని చెరువు, కిసాన్ సాగర్, పాత చెరువు, మొగిలికుంట, మహబూబ్ సాగర్, తాళ్లపల్లి చెరువు, పోచమ్మ కుంట, ఉత్తరపల్లి చెరువుల్లో సగానికి పైగా చెరువులు ఆనవాళ్లు లేకుండా పోయాయి. మరికొన్ని చెరువులకు గండ్లు పడి నీళ్లు  వృథాగా పోతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత ఆఫీసర్లు చెరువులను, వాటి కట్టల రిపేర్​ చేయాలని  స్థానిక రైతులు కోరుతున్నారు.