నిఘానేత్రం.. రిపేర్.. సీసీ కెమెరాలున్నా.. ఫలితం సున్నా

నిఘానేత్రం.. రిపేర్.. సీసీ కెమెరాలున్నా.. ఫలితం సున్నా
  • రిపేర్లు మరిచిన అధికారులు అలంకారప్రాయంగా మారిన వైనం
  • పట్టపగలు చోరీలు, చైన్ స్నాచింగ్ లు
  • ఆందోళనలో బాధితులు, గ్రామస్తులు
  • మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలంలో ఇదీ తీరు

 శామీర్ పేట, వెలుగు: ఏదైనా ప్రాంతంలో దోపిడీలు, అసాంఘిక శక్తుల ఆగడాలు, యాక్సిడెంట్లు వంటి ఘటనలు జరిగితే పోలీసులకు దర్యాప్తులో సీసీ కెమెరాల ఫుటేజ్ లే కీ రోల్ పోషిస్తాయి. కానీ.. అక్కడ వరుసగా చోరీలు జరుగుతుండగా సీసీ కెమెరాలు పని చేయడంలేదు.  కేవలం అలంకారప్రాయంగానే మిగిలాయి.  దీంతో పోలీసులు, అధికారుల నిర్లక్ష్యంపై స్థానిక ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 

మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలంలో వందల్లో  సీసీ కెమెరాలు అమర్చారు.  మొదట్లో వీటిని పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రజాప్రతినిధులు, దాతలు, వ్యాపారాలు, ఇతర సంస్థల సహకారంతో ప్రారంభించారు. ఎంత ఆర్భాటంగా ఓపెన్ చేశారో.. అంతేస్థాయిలో  వాటి నిర్వహణ, రిపేర్లు సమస్యగా మారాయి. ఎన్ని పనిచేస్తున్నాయో.. లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. పర్యవేక్షణకు ప్రత్యేక సిబ్బందిని, నిధులను కేటాయించలేదు. 

పంచాయతీ అధికారులు కూడా పట్టించుకోవడంలేదు. కేశవరం  పంచాయతీ పరిధిలో 12 కెమెరాలు ఉంటే నాలుగు మాత్రమే పనిచేస్తున్నాయి.  లక్ష్మీపూర్ లో 38 కెమెరాలు ఉంటే.. రెండే పని చేస్తుండగా.. మిగతావి రిపేర్లు అయ్యాయి.  అవి మరమ్మతులకు నోచుకోవడంలేదు. పట్టపగలు  చోరీలు జరుగుతుండగా.. పోలీసులు ఘటనల తీరును పరిశీలిద్దామంటే సీసీ కెమెరాలు పనిచేయడంలేదు. దీంతో  దర్యాప్తులో భాగంగా కేసులు పెండింగ్ పడుతున్నాయని చోరీకి గురైన బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

 కేసుల్లో ముందుకు సాగని దర్యాప్తు

ఇటీవల మేడ్చల్ జిల్లా శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీలు, చైన్ స్నాచింగ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. సీసీ కెమెరాల రిపేర్ల కారణంగా కొన్ని కేసుల్లో దర్యాప్తు ముందుకుసాగడంలేదు. కొన్ని సంఘటనల్లో చూస్తే సీసీ ఫుటేజ్ కోసం ప్రయత్నించినా ఫలితం లేదు. పనిచేసే వాటిలో కొన్ని కెమెరాలు తక్కువ ఫ్రీక్వెన్సీ కలిగి ఉండగా నిందితుల ఫొటోలు, వీడియోల్లో స్పష్టత లేదు.  మరికొన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు లేకపోగా వరుసగా చైన్ స్నాచింగ్ లు,  చోరీలు జరుగుతుండగా.. ఏం జరుగుతుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి పనిచేయని సీసీ కెమెరాల రిపేర్లు చేయించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. 

నాలుగే పని చేస్తున్నయ్ 

కేశవరం పంచాయతీ పరిధిలో 12 సీసీ కెమెరాలు ఉంటే, అందులో నాలుగు మాత్రమే పని చేస్తున్నాయి.  అధికారులు స్పందించి వెంటనే సీసీ కెమెరాలను రిపేరు చేయించాలి.  పోలీసులు మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి  చైన్ స్నాచింగ్​లు జరగకుండా చూడాలి. 
 – నరేందర్, కేశవరం

పట్టపగలు చోరీలు జరిగినా..  

 పట్టపగలే ఒంటరిగా వెళ్తున్న మహిళలపై దొంగలు రెచ్చిపోతున్నారు. చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్నారు. పోలీసుల దర్యాప్తులో కీలకమైన సీసీ కెమెరాలు సరిగా పని చేయడంలేదు. దీంతో దొంగలను ఎలా గుర్తించాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇకనైనా అధికారులు స్పందించి సీసీ కెమెరాలను బాగు చేయించాలి. చోరీలను అరికట్టాలి.  – మల్లేశ్, కేశవరం