Jana Nayagan Censor: విడుదలకు ముందే చిక్కుల్లో ‘జన నాయగన్’.. సెన్సార్ ఆలస్యం వెనుక కుట్రేనా?

Jana Nayagan Censor: విడుదలకు ముందే చిక్కుల్లో ‘జన నాయగన్’.. సెన్సార్ ఆలస్యం వెనుక కుట్రేనా?

కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయగన్’ (తెలుగులో ‘జన నాయకుడు’). సంక్రాంతి కానుకగా జనవరి 9న తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఇది విజయ్ చివరి సినిమా కావడంతో, ఫ్యాన్స్ మరియు సినీ ప్రియుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సినిమా సెన్సార్ సమస్యల్లో చిక్కుకుంది. 

‘జన నాయగన్’ విడుదలకు ఇంకా 2 రోజుల మాత్రమే టైం ఉంది. అయితే, ఈ చిత్రానికి ఇంకా CBFC (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) నుంచి సెన్సార్ సర్టిఫికెట్ రాలేదు. ఈ సమస్యపై చిత్ర నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై ఇవాళ మంగళవారం (జనవరి 6న) అత్యవసర విచారణ జరగనుందని సమాచారం. దీనికి సంబంధించిన తీర్పు సాయంత్రం లోపు రానుంది. 

‘జన నాయగన్’ పాన్ ఇండియా భాషల్లో తెరకెక్కింది. తమిళంతో పాటు హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో కూడా విడుదల కావాల్సి ఉంది. అయితే ముందుగా తమిళ వెర్షన్‌కు సెన్సార్ సర్టిఫికెట్ వస్తేనే ఇతర భాషల వెర్షన్లకు అనుమతి లభిస్తుంది. అందువల్ల సినిమా విడుదల నేపథ్యంలో సస్పెన్స్ కొనసాగుతుంది.

ప్రముఖ నేషనల్ నివేదికల ప్రకారం, ఈ మూవీకి U/A సర్టిఫికెట్ రేటింగ్ లభించింది. సుమారు నెల రోజుల క్రితమే పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి సినిమాను సెన్సార్‌కు పంపారు. డిసెంబర్ 19న CBFC కొన్ని కట్స్ చేయాలని, కొన్ని డైలాగ్స్ మ్యూట్ చేయాలని సూచనలు ఇచ్చినట్లు సమాచారం.ఈ ఆలస్యం ఉద్దేశపూర్వకంగా జరిగిందని తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ CTR నిర్మల్ కుమార్ ఆరోపించారు.

సెన్సార్ కమిటీ డిసెంబర్ 19న సినిమాను ఇప్పటికే వీక్షించిందని, ఇంకా ఇప్పటి వరకు ఎటువంటి సర్టిఫికెట్ జారీ కాలేదని ఆయన చెప్పుకొచ్చారు. కానీ సాంకేతిక కారణాలను చూపుతూ సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ జారీ చేయడానికి నిరాకరించిందని తెలిపారు.

సెన్సార్ అనుమతి రాకపోవడంతో ఇప్పటివరకు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభం కాలేదు. తమిళనాడు మరియు తెలుగు రాష్ట్రాలలో అడ్వాన్స్ బుకింగ్ ఇంకా తెరవకపోవడంతో, జన నాయగన్ టిక్కెట్ల అమ్మకాలపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్లు చివరి నిమిషంలో సమస్యలను నివారించడానికి బుకింగ్‌లు తెరవడానికి ఇష్టపడవు. మరి ఏమవుతుందో చూడాలి!