వరంగల్, వెలుగు: వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల వరుస చైన్ స్నాచింగ్‍లు, తాళం వేసిన ఇండ్లల్లో చోరీలు చేస్తున్న రెండు ముఠాలకు చెందిన నలుగురిని అరెస్ట్ చేసినట్టు సీపీ సన్‍ప్రీత్‍సింగ్ బుధవారం తెలిపారు. తమిళనాడుకు చెందిన కల్యాణ సుందరం (30), సెల్వరాజ్ (28) వివిధ రాష్ట్రాల్లో దొంగతనాలు చేస్తూ.. జైలుకు వెళ్లి వచ్చారు. అయినా తీరు మార్చుకోలేదు.
ఈ క్రమంలో వరంగల్ మట్టెవాడ పీఎస్ పరిధిలో మొదట ఓ బైక్ చోరీ చేసి దానిపై తిరుగుతూ దొంగతనాలు చేశారు. హనుమకొండ, కేయూసీ పరిధిలో ఒకటి , ఏపీలోని కర్నూల్ లో మూడు చైన్ స్నాచింగ్ లు చేశారు. వీరినుంచి రూ.15 లక్షల 20 వేల విలువైన 95 గ్రాముల బంగారు అభరణాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
క్రైం ఏసీపీ సదయ్య, హనుమకొండ ఏసీపీ నర్సింహారావు, సీసీఎస్ ఇన్స్‍పెక్టర్ రాఘవేందర్, రామకృష్ణ, హనుమకొండ, సుబేదారి సీఐలు శివకుమార్, రంజిత్‌ను సీపీ అభినందించారు. మరో ఘటనలో తాళం వేసిన ఇండ్లల్లో చోరీలకు పాల్పడుతున్న కొత్తూర్‍జెండాకు చెందిన బింగి రఘు (19) కొత్తూర్, కుమార్‍పల్లి, శ్రీనగర్ కాలనీ ప్రాంతాల్లో ఇండ్లల్లో చోరీలు చేసి బంగారు, వెండి అభరణాలు దొంగిలించినట్లు సీపీ తెలిపారు.
బొక్కలగడ్డకు చెందిన మహ్మద్ అసద్ (19) కాజీపేట బాపూజీ నగర్ ఏరియాలో చోరీలు చేసినట్లు చెప్పారు. వీరినుంచి రూ.10 లక్షల విలువైన 35 గ్రాముల బంగారు అభరణాలు, రూ.02 లక్షల నగదు, టీవీలు, ల్యాప్‍టాప్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, అడిషనల్ క్రైమ్స్ డీసీపీ బాలస్వామి పాల్గొన్నారు.
