అకడమిక్ కరికులంతో పాటు స్పోకెన్ ఇంగ్లిష్ : ఆకునూరి మురళి

అకడమిక్ కరికులంతో పాటు స్పోకెన్ ఇంగ్లిష్ : ఆకునూరి మురళి
  • గత పదేండ్లలో విద్యా వ్యవస్థ కుంటుపడింది: ఆకునూరి మురళి

ఓయూ, వెలుగు: విద్యార్థులకు అకడమిక్ కరికులంతో పాటు స్పోకెన్ ఇంగ్లిష్ కూడా నేర్పించాలని విద్యా కమిషన్ చైర్మన్​ ఆకునూరి మురళి ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకులకు సూచించారు. ఎంఎస్ ఎక్సల్, ఎంఎస్ వర్డ్ లాంటి కనీస నైపుణ్యాల్లో ట్రైనింగ్​ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలన్నారు. విద్యారంగంలో ప్రభుత్వం ఖర్చు పెడుతున్న మొత్తంలో మూడో వంతు కూడా ప్రైవేటు పాఠశాలల్లో సగటున ఒక్కో విద్యార్థిపై ఖర్చు పెట్టడడం లేదని.. అయినప్పటికీ ప్రభుత్వ విద్యావ్యవస్థ కుంటుపడిందని మురళి పేర్కొన్నారు.

మంగళవారం ఓయూ అడ్మినిస్ట్రేటివ్​భవనంలో క్యాంపస్, అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్స్, ఇతర అధికారులతో ఆయన సమావేశమై విద్యారంగ సమస్యలపై చర్చించారు. ప్రత్యేకంగా ఓయూలో సమస్యలు, విద్యారంగ సవాళ్లు, పరిష్కారాలు, అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై 4 గంటల పాటు సమీక్షించారు. వర్సిటీలో మౌలిక వసతులు, ఆర్థిక వనరులు, అడ్మిషన్లు, మెస్ బకాయిలు, ఫీజు రీయింబర్స్​మెంట్, పరిశోధనలు, నిధుల కొరత, బోధన, బోధనేతర సిబ్బంది ఖాళీలు, నియామకాలపై చర్చించారు. పీజీ కాలేజీల్లో మౌలిక వసతులు, ఉద్యోగాల భర్తీపైనా ఆయన మాట్లాడారు. 

గత పాలకులు వర్సిటీని పూర్తిగా విస్మరించారు

ఉస్మానియా యూనివర్సిటీలో 80 శాతం అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆకునూరి మురళి తెలిపారు. ఉమ్మడి ఏపీలో ఓయూకు ఎంతో పేరుండేదని, గత పాలకులు పది సంవత్సరాలుగా యూనివర్సిటీని పూర్తిగా విస్మరించారన్నారు. అనేక సమస్యలతో ఉస్మానియ యూనివర్సిటీ.. వాటి అనుబంధ కాలేజీలు కొట్టు మిట్టాడుతున్నాయన్నారు.