ఎల్​ఐసీ నుంచి మరిన్ని పాలసీలు

ఎల్​ఐసీ నుంచి మరిన్ని పాలసీలు
  • రెండంకెల గ్రోత్​ వైపు చూపు
  • చైర్మన్​ సిద్ధార్థ మొహంతి వెల్లడి

న్యూఢిల్లీ : కొత్త బిజినెస్​ ప్రీమియంలో రెండంకెల గ్రోత్​ సాధించే దిశలో లైఫ్​ ఇన్సూరెన్స్​ కార్పొరేషన్​ (ఎల్​ఐసీ) అడుగులు వేస్తోంది. ఈ దిశలో రాబోయే నెలల్లో మూడు, నాలుగు కొత్త పాలసీలు తెచ్చే ఆలోచనలో ఉంది. కిందటేడాదితో పోలిస్తే ఈ ఫైనాన్షియల్​ ఇయర్లో కొత్త బిజినెస్​ ప్రీమియంలో రెట్టింపు గ్రోత్​ సాధించాలనే టార్గెట్​తో పనిచేస్తున్నట్లు ఎల్​ఐసీ చైర్మన్​ సిద్ధార్థ మొహంతి వెల్లడించారు. ఇండివిడ్యువల్​ రిటైల్​ బిజినెస్​ ఇటీవలి కాలంలో పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని, అందుకే తాము టార్గెట్లను చేరుకోగలమనే ధీమాతో ఉన్నామని చెప్పారు.

తేబోయే కొత్త ప్రొడక్టులు ఆకర్షణీయమైనవిగా ఉంటాయని పేర్కొన్నారు. డిసెంబర్​ మొదటి వారంలో ఒక కొత్త ప్రొడక్టును తెస్తామని, మార్కెట్లో ఈ ప్రొడక్టు మంచి ఆదరణ పొందుతుందనే ఆశాభావాన్ని మొహంతి వ్యక్తం చేశారు. ఈ కొత్త ప్రొడక్టు వివరాలను కొన్నింటిని ఆయన పంచుకున్నారు. ఎష్యూర్డ్​ రిటర్న్స్​ ఇవ్వడంతోపాటు,  మెచ్యూరిటీ తర్వాత పాలసీ హోల్డర్​ సమ్​ ఎష్యూర్డ్​లో 10 శాతాన్ని జీవితాంతం పొందే వీలుంటుందని పేర్కొన్నారు. ఈ ప్రొడక్టు కచ్చితంగా మార్కెట్లో ఒక సంచలనమవుతుందని చెప్పారు.

ఎందుకంటే, తాము ఇప్పుడు కడుతున్న ప్రీమియంపై తమకు 2‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌0–25 ఏళ్ల తర్వాత ఏ విధమైన రిటర్న్స్​ వస్తాయనే దానిపై అందరికీ ఆసక్తి ఉంటుందని అన్నారు. లోన్​ ఫెసిలిటీతోపాటు, ప్రీ మెచ్యూర్​ విత్​డ్రాయల్​ కూడా కొత్త ప్రొడక్టులో ఉండే ఫీచర్లని మొహంతి వెల్లడించారు. పాలసీ హోల్డర్లు, షేర్ ​హోల్డర్లకు గ్యారంటీడ్​ రిటర్న్​ ప్రొడక్టులు మేలు కలిగిస్తాయని పేర్కొన్నారు. ఎల్​ఐసీ షేర్​ హోల్డర్లలో చాలా మంది పాలసీ హోల్డర్లు కూడా ఉన్నారని

వారికి రెండు రకాల ప్రయోజనం కలుగుతుందని వివరించారు. ఆ తర్వాత నెలల్లో మరో రెండు, మూడు కొత్త ప్రొడక్టులను మార్కెట్లోకి తెస్తామని చెప్పారు.ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఎల్​ఐసీ కొత్త బిజినెస్​ ప్రీమియం ఇన్​కం 2.65 శాతం గ్రోత్​తో  రూ. 25,184 కోట్లకు చేరింది. ఐఆర్​డీఏఐ లెక్కల ప్రకారం కొత్త బిజినెస్​ ప్రీమియం ఇన్​కంలో ఎల్​ఐసీకి 58.50 శాతం వాటాతో మార్కెట్​ లీడర్​గా  ఉంది. .