గ్రేటర్ వ్యాప్తంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

గ్రేటర్ వ్యాప్తంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

హైదరాబాద్/ఎల్ బీనగర్/ఓయూ/ముషీరాబాద్ /మల్కాజిగిరి/ షాద్ నగర్/ వికారాబాద్, వెలుగు:  గ్రేటర్ వ్యాప్తంగా చాకలి ఐలమ్మ జయంతిని సోమవారం  నాయకులు, అధికారులు ఘనంగా నిర్వహించారు. బల్దియా హెడ్డాఫీసులో ఏర్పాటు చేసిన ఐలమ్మ ఫొటో వద్ద మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నివాళులర్పించారు. కమిషనర్ లోకేశ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్​లో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఖైరతాబాద్​లోని వాటర్ బోర్డు హెడ్డాఫీసులో ఎండీ దానకిశోర్ ఆధ్వర్యంలో జయంతిని నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా తారామతి పేటలో ఐలమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు.

 

కార్యక్రమంలో నాయకులు మల్ రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.  బీసీ సంఘాల ఆధ్వర్యంలో అంబర్ పేటలోని బీసీ భవన్​లో ఐలమ్మ జయంతి వేడుకలు జరిగాయి. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ట్యాంక్ బండ్​పై ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో చాకలి ఐలమ్మ ఫొటో వద్ద వారు నివాళులు అర్పించారు.  ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షుడు  శ్రీను, నాయకులు రవి నాయక్, తదితరులు పాల్గొన్నారు. 

వికారాబాద్ పట్టణంలో చాకలి ఐలమ్మ జయంతిని నిర్వహించారు. నేరెడ్ మెట్, మల్కాజిగిరిలో కార్పొరేటర్లు రాజ్యలక్ష్మి, మీనారెడ్డి, కాంగ్రెస్ ఇన్ చార్జి నందికంటి శ్రీధర్, రజక సంఘాల సభ్యులు ఐలమ్మ ఫొటో వద్ద నివాళి అర్పించారు. ఎమ్మెల్యే ఆనంద్, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి ఉపేందర్, అధికారులు నివాళులర్పించారు. షాద్ నగర్​లో కాంగ్రెస్ ఇన్ చార్జి వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతిని నిర్వహించారు.