నాకిది ఛాలెంజింగ్ రోల్ : కీర్తి సురేష్

నాకిది ఛాలెంజింగ్ రోల్  : కీర్తి సురేష్

గ్లామర్ రోల్స్ అయినా,  లేడీ ఓరియంటెడ్ పాత్రలైనా తనదైన నటనతో ఆకట్టుకుంటోంది కీర్తి సురేష్. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులు చేస్తోన్న ఆమె.. ఒక్కో చిత్రంలో ఒక్కో డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తోంది. నాని  హీరోగా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌‌లో రూపొందిన ‘దసరా’ చిత్రంలో హీరోయిన్‌‌గా నటించింది కీర్తి సురేష్. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా మార్చి 30న తెలుగు, తమిళ, కన్నడ,  మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా కీర్తి సురేష్ ఇలా ముచ్చటించింది. 

 ‘‘నా కెరీర్‌‌‌‌లో పోషించిన ఛాలెంజింగ్ రోల్ ఇది. మేకప్ వేయడానికి, తీయడానికి కూడా కొన్ని గంటలు పట్టేది. దుమ్ము , బొగ్గు ఇలా రస్టిక్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో షూట్ చేశాం. తెలంగాణ యాస మాట్లాడే పాత్ర. దీనికోసం అసోసియేట్ డైరెక్టర్ శ్రీనాథ్‌‌తో పాటు ఒక ప్రొఫెసర్ హెల్ప్‌‌తో తెలంగాణ యాస నేర్చుకున్నా.  మొదట కష్టం అనిపించింది. తర్వాత అలవాటైపోయింది. డబ్బింగ్ కూడా నేనే చెప్పాను.  వెన్నెల  పాత్రలో అందరికీ కనెక్ట్ అవుతాను.  సినిమా పూర్తి చేసిన తర్వాత కూడా దానితో ఒక ఎమోషనల్ కనెక్షన్ ఫీల్ అవుతాం. అది ‘మహానటి’కి ఉండేది. ఇప్పుడు ‘దసరా’కి  వచ్చింది.  

శ్రీకాంత్ కథను చాలా చక్కగా రాసుకున్నారు. ప్రతిదానిపై క్లారిటీగా ఉండేవారు. చమ్కీల అంగీలేసుకొని పాట చాలా పాపులర్ అయ్యింది.  ఆ పాట వినగానే అన్ని పెళ్లిళ్లలో ఇదే పాట మారుమ్రోగుతుందని ముందే అనుకున్నాం. అదే వైబ్ కంటిన్యూ అవుతుంది.  మేము ఊహించిన దాని కంటే ఆ పాట పెద్ద విజయం సాధించింది. బాలీవుడ్‌‌లో కొన్ని కథలు విన్నాను. కానీ బలమైన పాత్ర అనిపించలేదు. నాకు మాత్రం చేయాలనే వుంది. అయితే ముందు మంచి పాత్రలు, కథలు కుదరాలి. ఇప్పుడు ‘దసరా’ పాన్ ఇండియా వైడ్‌‌గా విడుదలవుతుంది కాబట్టి ఇంకా మంచి రోల్స్ వస్తాయేమో చూడాలి”.