
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో రైతు ఐకాస ఆధ్వర్యంలో 'ఛలో ఆర్మూర్' కార్యక్రమం నిర్వహించారు. రైతు ఐకాస కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మామిడిపల్లి రోడ్డుపై బైఠాయించారు. ధర్నాకు బీఆర్ఎస్, బీజేపీ, వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన మాటకు కట్టుబడి రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలన్నారు. తక్షణమే ఎకరానికి రూ.7500 చొప్పున రైతు భరోసా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఆర్మూర్లో ఉద్రిక్తత..
మహాధర్నా నేపథ్యంలో ఆర్మూర్ పట్టణంలో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ధర్నా చేసేందుకు రైతులను అనుమతించలేదు. పరిష్మన్ లేకుండా రోడ్డుపై ధర్నా చేస్తే చర్యలు తీసుకుంటామని ఆదేశించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, బీజేపీ నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. రైతులు మామిడిపల్లికి రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. రేపటి వరకు ఆర్మూర్, బాల్కొండ సెగ్మెంట్లలో పోలీసులు ఆంక్షలు విధించారు. రైతులందరూ పంక్షన్ హాల్లో సమావేశమయ్యారు. అనంతరం పోలీసులు ధర్నా చేసేందుకు అనుమతి ఇచ్చారు.