- బౌలర్లు అదుర్స్
- నాలుగో టీ20లో టీమిండియా గెలుపు
- 48 రన్స్ తేడాతో ఓడిన ఆస్ట్రేలియా
- సుందర్, అక్షర్, దూబే షో
- సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో సూర్యసేన
గోల్డ్ కోస్ట్: ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు సూపర్ పెర్ఫామెన్స్ చూపెట్టారు. వాషింగ్టన్ సుందర్ (3/3) కీలక స్పెల్‌కు తోడు అక్షర్ పటేల్ (2/20), శివమ్ దూబే (2/20) రాణించడంతో.. గురువారం (నవంబర్ 06) జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో ఇండియా 48 రన్స్ తేడాతో ఆసీస్‌ను ఓడించింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో సూర్యకుమార్‌సేన 2–1 ఆధిక్యంలో నిలిచింది.
టాస్ ఓడిన ఇండియా 20 ఓవర్లలో 167/8 స్కోరు చేసింది. శుభ్‌మన్ గిల్ (39 బాల్స్‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 46), అభిషేక్ శర్మ (21 బాల్స్‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 28), అక్షర్ పటేల్ (11 బాల్స్‌లో 1 ఫోర్, 1 సిక్స్‌తో 21 నాటౌట్) ధనాధన్ ఆటతో చెలరేగారు. తర్వాత ఆస్ట్రేలియా 18.2 ఓవర్లలో 119 రన్స్‌కే ఆలౌటైంది. కెప్టెన్ మిచెల్ మార్ష్ (24 బాల్స్‌లో 4 ఫోర్లతో 30) టాప్ స్కోరర్. అక్షర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య ఆఖరిదైన ఐదో టీ20 శనివారం కాన్‌బెర్రాలో జరుగుతుంది.
‘టాప్’ మాత్రమే..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇండియాను ఆసీస్ బౌలర్లు నేథన్ ఎలిస్ (3/21), ఆడమ్ జంపా (3/45) స్వల్ప స్కోరుకే కట్టడి చేశారు. ఓపెనర్లు అభిషేక్, గిల్ ఆరంభం నుంచే జోరు చూపడంతో ఇండియా 49/0తో పవర్‌ప్లేను ముగించింది. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 56 రన్స్ జత చేసి 7వ ఓవర్‌లో అభిషేక్ వెనుదిరిగాడు. స్పిన్నర్ జంపాను సమర్థంగా ఎదుర్కొనేందుకు శివమ్ దూబే (22)ను మూడో ప్లేస్‌కు ప్రమోట్ చేసినా పెద్దగా సక్సెస్ కాలేదు. దీనికి తోడు పేసర్ ఎలిస్ వైవిధ్యమైన బాల్స్‌తో ముప్పు తిప్పలు పెట్టాడు. 12వ ఓవర్ దూబేను ఔట్ చేసిన ఎలిస్ రెండో వికెట్‌కు 32 రన్స్ భాగస్వామ్యాన్ని ముగించాడు. ఈ దశలో వచ్చిన సూర్యకుమార్ (10 బాల్స్‌లో 2 సిక్స్‌లతో 20) భారీ సిక్స్‌లు బాదినా ఎక్కువసేపు వికెట్ కాపాడుకోలేదు. దాంతో మూడో వికెట్‌కు 33 రన్స్ జత కావడంతో స్కోరు 125/4గా నిలిచింది. ఇక్కడి నుంచి ఆసీస్ బౌలర్లు పట్టు బిగించారు. స్వల్ప వ్యవధిలో తిలక్ వర్మ (5), జితేష్ శర్మ (3), సుందర్ (17) వెనుదిరిగారు. ఈ దశలో అక్షర్ పటేల్ బ్యాట్ ఝుళిపించినా ఇండియా ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. బార్ట్‌లెట్, స్టోయినిస్ చెరో వికెట్ తీశారు.
మార్ష్ ఒక్కడే..
స్వల్ప స్కోరును కాపాడటంలో ఇండియా బౌలర్లు సూపర్ సక్సెస్ అయ్యారు. ఓ ఎండ్‌లో మార్ష్ పోరాడినా.. రెండో ఎండ్‌లో బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. తొలి వికెట్‌కు 37 రన్స్ జోడించి ఐదో ఓవర్‌లో మాథ్యూ షార్ట్ (25) ఔటయ్యాడు. మూడు బాల్స్ తేడాలో జోష్ ఇంగ్లిస్ (12), మార్ష్ వెనుదిరిగారు. మధ్యలో టిమ్ డేవిడ్ (14), జోష్ ఫిలిప్ (10) నిరాశపర్చడంతో ఆసీస్ 98 రన్స్‌కే 5 వికెట్లు చేజార్చుకుంది. 14వ ఓవర్‌లో వరుణ్ (1/26).. మ్యాక్స్‌వెల్ (2)ను వెనక్కి పంపాడు. ఈ దశలో సుందర్ సూపర్ స్పెల్‌తో ఆకట్టుకున్నాడు. 17వ ఓవర్‌లో వరుస బాల్స్‌లో మార్కస్ స్టోయినిస్ (17), బార్ట్‌లెట్ (0)ను, తన తర్వాతి ఓవర్‌లో ఆడమ్ జంపా (0)ను పెవిలియన్‌కు పంపాడు. మధ్యలో బెన్ ద్వార్షుయిస్ (5)ను బుమ్రా (1/27) బోల్తా కొట్టించాడు. వీళ్లందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కావడంతో ఆసీస్ టార్గెట్‌ను అందుకోలేకపోయింది.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా: 20 ఓవర్లలో 167/8 (గిల్ 46, అభిషేక్ 28, ఎలిస్ 3/21, జంపా 3/45).
ఆస్ట్రేలియా: 18.2 ఓవర్లలో 119 ఆలౌట్ (మార్ష్ 30, షార్ట్ 25, సుందర్ 3/3).
