పోడు పట్టాల కోసం మహబూబాబాద్​లో రైతుల చలో కలెక్టరేట్​

 పోడు పట్టాల కోసం మహబూబాబాద్​లో రైతుల చలో కలెక్టరేట్​

మహబూబాబాద్, వెలుగు: అర్హులైన గిరిజనేతర రైతులందరికీ పోడు పట్టాలు ఇవ్వాలని గురువారం చలో కలెక్టరేట్ నిర్వహించారు. మహబూబాబాద్​జిల్లాలోని కొత్తగూడ, గూడూరు, గంగారం మండలాల రైతులు భారీ ర్యాలీగా కలెక్టరేట్​కు వెళుతుండగా మూడుకోట్ల సెంటర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. రైతు ప్రతినిధుల బృందం మాత్రమే వెళ్లడానికి అనుమతి ఇస్తామనడంతో ఒప్పుకున్నారు. తర్వాత అడిషనల్​ కలెక్టర్​ డేవిడ్ కు వినతిపత్రం అందజేశారు. ఏజెన్సీ గిరిజనేతర రైతుల జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఎన్నో ఏండ్ల నుంచి గిరిజన రైతులతో పాటు గిరిజనేతరులు  కూడా పోడు సాగు చేసుకుంటున్నారన్నారు.

ఏజెన్సీ ఏరియాల్లో ఇతర కులాలకు చెందిన పోడు సాగుదారులకు సైతం హక్కు పత్రాలు ఇవ్వాలన్నారు. 20 ఏండ్ల నుంచి స్థిర నివాసం ఉంటున్న ప్రతి గిరిజనేతర  రైతుకు హక్కు పత్రాలు అందించాలన్నారు. 1930 నుంచి నివాసం ఉంటున్నట్లు అర్హతను ధ్రువీకరించుకోవాలని రూల్​ పెట్టడం సరి కాదన్నారు. 1947కు ముందు అటవీ హక్కుల చట్టమే లేదన్నారు. నేటికీ కాలం చెల్లిన బ్రిటీష్ చట్టాలను అమలు చేయడం దారుణమన్నారు. అర్హులైన గిరిజనేతరులకు పోడు పట్టాలు ఇవ్వకుంటే పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు, జిల్లా ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు స్పందించి గిరిజనేతరులందరికీ పోడు హక్కుపట్టాలు అందించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.