శ్రీకాంత్ కొడుకు రోషన్ మేక హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చాంపియన్’. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నాడు. అశ్వనీదత్ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ బ్యానర్స్‌పై ప్రియాంక దత్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రోషన్ ఫస్ట్ లుక్, గ్లింప్స్ మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి. శనివారం టీజర్‌ను రిలీజ్ చేశారు. స్వాతంత్ర్యానికి ముందు జరిగే కథగా దీన్ని చూపించారు.
ఫుట్‌బాల్ ప్లేయర్ మైఖేల్ సీ. విలియమ్స్ పాత్రలో రోషన్ కనిపించిన తీరు ఆకట్టుకుంది. తన ప్రతిభ కారణంగా ఇంగ్లండ్‌లో రాణి ఎలిజబెత్‌ను కలుసుకునే అవకాశం దక్కుతుంది. దేశం కోసం ఆడే అవకాశమొచ్చినా, అతని మనసు మాత్రం తన ప్రేయసి వద్దే ఉంటుంది. కానీ జీవితం అతనికి మరిన్ని సవాళ్లు, భావోద్వేగాలు, యుద్ధం, ప్రేమ.. అన్నీ ఒకేసారి ఎదురుచూపిస్తుంది.
హైదరాబాదీ యాసలో హిందీ మిక్స్ చేసి రోషన్ చెప్పిన డైలాగ్ డెలివరీ చాలా నేచురల్‌గా క్యారెక్టర్‌కి తగినట్టుగా ఉంది. యాక్షన్ సన్నివేశాల్లో ఎనర్జీ, రొమాంటిక్ సీన్స్‌లో క్యూట్‌నెస్‌తో ఇంప్రెస్ చేశాడు. హీరోయిన్‌గా నటించిన అనస్వర రాజన్‌తో తన కెమిస్ట్రీ ఆకట్టుకుంది. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ చిత్రం విడుదల కానుంది.
