చాంపియన్స్ లీగ్ రీస్టార్ట్‌‌ ! 2026 నుంచి నిర్వహించాలని ఐసీసీ ఆలోచన

చాంపియన్స్ లీగ్ రీస్టార్ట్‌‌ ! 2026  నుంచి నిర్వహించాలని ఐసీసీ ఆలోచన

లండన్‌‌: దశాబ్ద విరామం తర్వాత చాంపియన్స్ లీగ్ టీ20 (సీఎల్‌‌టీ20) టోర్నమెంట్ తిరిగి మొదలయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాది నుంచి ఈ మెగా టోర్నీని రీస్టార్ట్ చేయాలని ఐసీసీ భావిస్తోంది. దీనికి క్రికెట్ బోర్డులు బీసీసీఐ, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ బోర్డు మద్దతు తెలిపాయి. చివరిగా 2014లో జరిగిన సీఎల్‌‌టీ20లో  చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచింది. ఈ టోర్నమెంట్ 2009-–2014 మధ్య ఆరు సార్లు జరిగింది. ఈ లీగ్ తిరిగి వస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్లబ్ టీమ్స్‌‌ ఒకే వేదికపై పోటీపడతాయి.

ఇక, టెస్ట్ క్రికెట్‌‌ను రెండు అంచెలుగా (టు టైర్ సిస్టమ్‌‌) మార్చే అవకాశాలను పరిశీలించడానికి ఐసీసీ ఎనిమిది మందితో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఏడాది చివర్లో ఐసీసీ బోర్డుకు తమ వేదికను  సమర్పిస్తుంది. ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందితే 2027–-2029 మధ్య జరిగే తదుపరి వరల్డ్‌‌ టెస్ట్ చాంపియన్‌‌షిప్‌‌ (డబ్ల్యూటీసీ)లో కొత్త విధానం అమల్లోకి రానుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీలో 9జట్లు బరిలో ఉండగా.. కొత్త ప్రతిపాదన ప్రకారం, రెండు డివిజన్లలో ఆరు చొప్పున మొత్తం 12 జట్లు పోటీపడతాయి.