- 16న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పంపు హౌజ్ నుంచి నీటి విడుదల
- కెనాల్ లో భూములు కోల్పోయిన రైతులకు రూ.70 కోట్ల పరిహారం
- ప్రాజెక్టు ద్వారా 50 వేల ఎకరాలకు సాగునీరు
ఆదిలాబాద్, వెలుగు: చనాఖా-కోరట బ్యారేజ్ కు తొలి అడుగు పడింది. 50 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్న ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలంలోని చనాఖా–కోరట బ్యారేజీ పనులు 80 శాతం పూర్తయ్యాయి. దీంతో బ్యారేజీ పంప్ హౌజ్ ను ప్రారంభించి నీటిని విడుదల చేసేందుకు ఈ నెల 16న సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు రానున్నారు. గత నెలలో జిల్లాకు వచ్చిన సీఎం రూ.500 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు.
తాజాగా మరోసారి జిల్లాకు రానుండగా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సీఎంతో పాటు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణరావు హాజరుకానున్నారు. 16న ఉదయం 10:50 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి, 12 గంటలకు బోరజ్ మండలం హత్తిఘాట్ వద్ద పంప్ హౌజ్ వద్దకు చేరుకుంంటారు. అక్కడ శిలాఫలకం ఆవిష్కరించి బ్యారేజీ పంప్ హౌజ్ ను ప్రారంభించి మెయిన్ కెనాల్స్ కు నీటిని విడుదల చేయనున్నారు.
ఎన్నో ఏళ్ల కల నెరవేరే వేళ..
ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల రైతుల ఎన్నో ఏళ్ల కల నెరవేరనుంది. తెలంగాణ, -మహారాష్ట్ర సరిహద్దులోని పెన్ గంగా నదిపై 2015 లో చనాఖా–కోరట బ్యారేజీ నిర్మాణాన్ని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. రూ.386 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టు అంచనాలు పెంచుతూ రాగా, చివరకు రూ.1,891 కోట్లకు చేరింది.
2018లో ప్రాజెక్టు పూర్తి చేయాలని గడువు విధించగా, నిధుల కొరతతో తీవ్ర జాప్యం జరిగింది. ఎట్టకేలకు బ్యారేజీ నిర్మాణం పూర్తి చేసిన అధికారులు తాజాగా పంప్ హౌజ్ నుంచి నీటిని విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. సీఎం ప్రారంభించనున్న పంప్ హౌజ్ కు ఆరు మోటార్లు బిగించారు. ఇందులో 5.5 మెగావాట్ల మోటార్లు మూడు, 12 మెగవాట్ల మోటార్లు మూడు ఏర్పాటు చేశారు.
ఈ ప్రాజెక్టు ద్వారా బోథ్ నియోజకవర్గంలోని తాంసి, భీంపూర్, ఆదిలాబాద్ నియోజకవర్గంలోని భోరజ్, ఆదిలాబాద్, బేల మండలాల్లోని 51 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఇప్పటి వరకు బ్యారేజ్, పంప్ హౌజ్, ఎల్పీపీ మెయిన్ కెనాల్ పనులు పూర్తయ్యాయి.
ఇంకా ఉప కాలువలు, పిప్పల్ కోటి రిజర్వాయర్ పనులు జరుగాల్సి ఉంది. మరో 1,800 ఎకరాల భూసేకరణ చేపడితే ప్రాజెక్టు పనులు పూర్తవుతాయి. భూసేకరణ కోసం రూ.175 కోట్లు పరిహారం అందజేయాల్సి ఉండగా, ఇందులో రూ.70 కోట్ల పరిహారం సీఎం అందించనున్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
సీఎం పర్యటన ఏర్పాట్లను ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. భోరజ్ మండలం హత్తిఘాట్ గ్రామంలో బ్యారేజీ పంప్ హౌజ్ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి, భద్రత, ప్రోటోకాల్ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. భద్రత కారణాల దృష్ట్యా గుర్తింపు కార్డులతో పాటు పాస్ లు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తామని, గ్రామస్తులు, అధికారులు సహకరించి కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని వారు కోరారు.
నిర్మల్ జిల్లాలోనూ సీఎం పర్యటన..
చనాఖా–కోరట బ్యారేజీ పంప్ హౌజ్ ప్రారంభించిన అనంతరం సీఎం నిర్మల్ జిల్లాలో పర్యటిస్తారు. మామడ మండలంలోని పోన్కల్ గ్రామంలో గోదావరి నదిపై నిర్మించిన సదర్మాట్ బ్యారేజీని ప్రారంభించనున్నారు. యాసంగి సాగు కోసం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయనున్నారు. 2016లో రూ. 676 కోట్లతో ఈ బ్యారేజీ నిర్మాణం చేపట్టగా, నిధులు లేమితో పనుల్లో జాప్యం జరిగింది.
ఈక్రమంలో ఎలక్ట్రిక్ పనుల కోసం రాష్ట్ర సర్కార్ రూ.12 కోట్లు విడుదల చేయడంతో పనులు పూర్తి చేశారు. నిర్మల్ జిల్లాలో 13 వేల ఎకరాలు, జగిత్యాల జిల్లాలో 5 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఈ ప్రాజెక్టుకు 1.58 టీఏంసీల సామర్థ్యంతో 55 గేట్లు ఏర్పాటు చేశారు. అనంతరం నిర్మల్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు.
